
FIFA World Cup | ఇంటర్నెట్‌డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్ కోసం అమెరికా (USA)కు వచ్చిన ఇరాక్ స్ట్రైకర్ అయెమెన్ హుస్సేన్ (Iraq striker Aymen Hussein)ను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు
తెలుస్తోంది. దాదాపు ఏడు గంటలపాటు విచారించి.. ఆ తర్వాత అతడిని విడుదల చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫిఫా ప్రపంచ కప్‌లో ఈ జట్టు అర్హత సాధించడంలో హుస్సేన్ కీలక పాత్ర పోషించాడు.
ఇరాకీ జట్టు అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున హుస్సేన్ తన జట్టుతో కలిసి షికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అక్కడి అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని.. దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. ఆ సమయంలో అతడి ఫోన్‌ను తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. చివరికి దేశంలోకి ప్రవేశించేందుకు హుస్సేనీకి అధికారులు అనుమతించారు. ఇదే సమయంలో ఇరాకీ జట్టు తరఫున వచ్చిన ఫొటో గ్రాఫర్ తలాల్ సలాహ్‌ను కూడా అధికారులు 10 గంటలపాటు నిర్బంధించి.. ఫోన్‌ను తనిఖీ చేసినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. అయితే, అతడిని అమెరికాలోకి ప్రవేశించేందుకు నిరాకరించినట్లు వెల్లడించాయి. ఈ ఘటనపై అటు ఇరాకీ ఫుట్‌బాల్ అసోసియేషన్ గానీ.. యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇక, ఫిఫా ప్రపంచ కప్-2026 (FIFA World Cup) మ్యాచ్‌లు జూన్ 11 నుంచి జులై 19 వరకు జరగనున్నాయి. 39 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీకి కెనడా, మెక్సికో, యూఎస్ఏ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిఫా వరల్డ్ కప్‌లో గ్రూప్-ఐలో ఇరాక్ ఉంది. ఈ గ్రూప్‌లోనే ఫ్రాన్స్, సెనెగల్, నార్వే జట్లు ఆడుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.