
ఇంటర్నెట్ డెస్క్: జో బైడెన్ (Joe Biden) అధికారంలో ఉన్న సమయంలో ప్రధాని మోదీ (PM Narendra Modi) బహూకరించిన 7.5 క్యారెట్ల సింథటిక్ వజ్రాన్ని అమెరికా మాజీ ప్రథమ మహిళ జిల్ బైడెన్ (Jill Biden) గుర్తు
చేసుకున్నారు. మోదీ బహుమతిగా ఇచ్చిన వజ్రాన్ని తనవద్దే ఉంచుకోవాలని తొలుత అనుకున్నానని.. కానీ, అమెరికా అధికారులు దానికి ఎక్కువ విలువ కట్టడంతో ఆ డైమండ్ (Diamond)ను ఫెడరల్ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసినట్లు ‘వ్యూ ఫ్రమ్ ది ఈస్ట్ వింగ్: ఎ మెమోయిర్’ అనే తన ఆత్మకథలో రాసుకొచ్చారు. ఈ పుస్తకంలో వైట్ హౌస్‌లోని తెరవెనుక జీవితం గురించి.. అధ్యక్షుడి కుటుంబం అందుకునే బహుమతులకు ఉన్న నిబంధనల గురించి జిల్ బైడెన్ వివరించారు.
2023, జూన్‌లో అమెరికా అధ్యక్ష భవనం ఇచ్చిన అధికారిక విందులో మోదీ అతిథిగా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన బహూకరించిన వజ్రం తనను ఎంతో ఆకర్షించిందని.. చాలా అద్భుతంగా ఉందని జిల్ బైడెన్ పేర్కొన్నారు. అయితే బైడెన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత అమెరికా నియమాల ప్రకారం.. ఆ బహుమతిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి వచ్చిందని తెలిపారు. దానికి అప్పట్లో ఉన్న మార్కెట్ విలువను చెల్లించి కొనుగోలు చేయడానికి అధికారులు అనుమతిస్తారని అన్నారు. దీంతో ఆ డైమండ్‌ను కొనుగోలు చేయాలని తాను అనుకున్నట్లు తెలిపారు.
విదేశాంగ శాఖ వజ్రం విలువను 20 వేల డాలర్లుగా అంచనా వేయడంతో దానిని కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. అందుకు బదులుగా ఆ వజ్రాన్ని అరువుగా తీసుకుని అధికారిక కార్యక్రమాల్లో ధరించడానికి అధికారులు తనకు అనుమతి ఇచ్చారని అన్నారు. దీంతో ఆ డైమండ్‌ను ఓ ఉంగానికి పొదిగించి ధరించినట్లు తెలిపారు. ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మెక్రాన్ తనకు ఇచ్చిన బ్రాస్లెట్ను అమెరికా ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. కాగా 2023లో జిల్ బైడ్న్కు ప్రపంచ దేశాధినేతల నుంచి అందిన బహుమతుల్లో అతి ఖరీదైనది మోదీ బహూకరించిన వజ్రమే అని అప్పట్లో అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.