
Hema Latha:టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ మరోసారి వార్తల్లో నిలిచారు. గతేడాది బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఆమె పేరు వినిపించడంతో
పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ ఆమెపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే తాజాగా ఆ కేసులో ఆమెకు న్యాయపరంగా ఊరట లభించడంతో హేమ స్పందించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల కర్ణాటక హైకోర్టు హేమపై నమోదైన కేసును కొట్టివేయడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మొదటి నుంచే తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ వచ్చానని, ఇప్పుడు కోర్టు తీర్పుతో నిజం బయటపడిందని అన్నారు. తాను కేవలం ఆహ్వానం మేరకు ఆ కార్యక్రమానికి హాజరయ్యానని, అక్కడ జరిగిన వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
అంతేకాకుండా తనపై వచ్చిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని, వైద్య పరీక్షల ఫలితాలు కూడా తనకు అనుకూలంగానే వచ్చాయని హేమ పేర్కొన్నారు. అందుకే చివరికి న్యాయస్థానం కూడా తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెప్పారు. ఈ కేసు కారణంగా తనపై అనవసరమైన ప్రచారం జరిగిందని, మానసికంగా కూడా ఎంతో ఇబ్బంది పడ్డానని వెల్లడించారు.
అయితే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా కొందరు సోషల్ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఫేక్ అకౌంట్ల ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, నిరాధార ఆరోపణలు చేయడం కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ట్రోలర్స్‌కు ఆమె ఘాటైన హెచ్చరిక జారీ చేశారు.
ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. ఫేక్ అకౌంట్ల వెనుక ఎవరు ఉన్నారో గుర్తించడం పెద్ద కష్టం కాదు. నన్ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారం చేస్తే సహించను. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఇంకా అవసరమైతే ఇంటికొచ్చి కూర్చుంటా అంటూ హేమ తీవ్రంగా స్పందించారు.
దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించిన హేమ తెలుగు ప్రేక్షకులకు ఎంతో పరిచితమైన ముఖం. ప్రస్తుతం సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటున్నారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా కోర్టు నుంచి ఊరట లభించిన తర్వాత హేమ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రోలింగ్, ఫేక్ అకౌంట్లపై ఆమె చేసిన ఘాటు హెచ్చరిక ఇప్పుడు నెటిజన్ల మధ్య విస్తృత చర్చకు దారి తీస్తోంది.