
ఆధునిక ఆర్థిక రంగంలో సాంకేతిక పురోగతి తీసుకువచ్చిన ప్రయోజనాలలో క్రెడిట్ కార్డు ఒకటి. ఒక సాధారణ స్వైప్ లేదా కొన్ని క్లిక్‌లతో, మీ కొనుగోళ్లకు నగదు చెల్లించే బదులుగా క్రెడిట్ కార్డును ఉపయోగించవచ్చు
. అయితే, మీ క్రెడిట్ కార్డు లావాదేవీలు, చెల్లింపులు వంటి అంశాలు మీ క్రెడిట్ స్కోర్‌పై కీలక ప్రభావాన్నే చూపుతాయి. చాలా బ్యాంకులు, రుణ సంస్థలు మీ క్రెడిట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయని మీరు తెలుసుకోవాలి. ఇది మీరు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే మీ రుణ అర్హతను, సామర్థ్యాలను నిర్ధారిస్తుంది. అందువల్ల, క్రెడిట్ స్కోరుపై క్రెడిట్ కార్డు ప్రభావం గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి.
క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకునే రుణాలతో సహా వివిధ రకాల రుణాలను తీసుకుని, వాటిని తిరిగి సకాలంలో చెల్లించడం మీ క్రెడిట్ స్కోరుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది వివిధ రకాల క్రెడిట్(రుణాల)ను సమర్ధవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించడంలో మీ సామర్ధ్యాన్ని, అనుభవాన్ని తెలియజేస్తుంది.
సుదీర్ఘమైన క్రెడిట్ చరిత్ర, ముఖ్యంగా బాధ్యతాయుతమైన క్రెడిట్ కార్డ్ వినియోగంలో సానుకూల ట్రాక్ రికార్డ్..మీ క్రెడిట్ స్కోర్‌పై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది కాలక్రమేణా క్రెడిట్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో మీ అనుభవాన్ని, సామర్థ్యాన్ని సూచిస్తుంది. మంచి క్రెడిట్ స్కోరు కోసం సుదీర్ఘమైన, సానుకూల క్రెడిట్ చరిత్రను నిర్మించుకోవడం చాలా అవసరం. దీనికై ముఖ్యంగా ఎక్కువ కాలం నుంచి బాధ్యతాయుతంగా ఉపయోగిస్తున్న క్రెడిట్ కార్డులను రద్దు చేయకూడదు. మీకు ఒకటి కన్నా ఎక్కువ కార్డులున్నప్పుడు వాటిలో ఎదో ఒకదాన్ని రద్దు చేస్తే, అది మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. మెరుగైన క్రెడిట్ హిస్టరీ మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగ్గా ఉంచుతుంది. మీ క్రెడిట్ హిస్టరీని నిర్మించడంలో పాత క్రెడిట్ కార్డు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి, ఈ విధంగా కూడా క్రెడిట్ కార్డు మీ క్రెడిట్ స్కోర్‌కు సహాయపడుతుంది.
ముఖ్యంగా, మీరు కార్డును కలిగి ఉన్న కాలంలో మీ రుణ అర్హత ఎలా అభివృద్ధి చెందిందో అంచనా వేయడానికి ఇది బ్యాంకుకు సహాయకారిగా ఉంటుంది. సుదీర్ఘ కాలవ్యవధి ఉన్న క్రెడిట్ కార్డులను రద్దు చేసుకున్నప్పుడు వాటిపై ఉన్న మెరుగైన క్రెడిట్ హిస్టరీ కూడా రద్దవుతుంది. కాబట్టి, వాటిని వినియోగంలో ఉంచడం మేలు. ప్రత్యేకించి దానికి అధిక క్రెడిట్ పరిమితి ఉంటే మీరు దానిని తరచూ ఉపయోగించకపోయినా, స్ట్రీమింగ్ సర్వీస్ సబ్స్క్రిప్షన్ వంటి ఖర్చులు, పునరావృతమయ్యే చిన్నచిన్న ఖర్చుల కోసం పాత క్రెడిట్ కార్డును యాక్టివ్‌గా ఉంచడం మేలు. కార్డు వల్ల సుదీర్ఘమైన క్రెడిట్ చరిత్ర, మంచి ట్రాక్ రికార్డ్ మీ CIBIL స్కోర్‌కు సానుకూలంగా ఉపయోగపడతాయి.
2-3 క్రెడిట్ కార్డులు మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఆటోమెటిక్‌గా మీ క్రెడిట్ పెరుగుతుంది. బహుళ కార్డులు మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని తగ్గించడంలో సహాయపడతాయి. క్రెడిట్ వినియోగ నిష్పత్తి తగ్గి ఉండడం వల్ల స్కోరు మెరుగ్గా ఉంటుంది. ఇక్కడ మీకున్న బహుళ క్రెడిట్ కార్డులు మీ స్కోరు మెరుగ్గా ఉండడానికి పరోక్షంగా సహాయపడతాయి. అలాగని, చాలా ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండడం వల్ల కూడా మీ క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుచేత, మీ ఆర్థిక వ్యవహారాలను 2-3 యాక్టివ్ క్రెడిట్ కార్డులకు పరిమితం చేసుకోండి. మరీ ఎక్కువ సంఖ్యలో కార్డులు కలిగి ఉండడం వల్ల తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు తలెత్తి, మీ క్రెడిట్ స్కోరును దెబ్బతీయవచ్చు. ఇది మీరు క్రెడిట్ గురించి అనేక కార్డులను ఉపయోగిస్తున్నారని, వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నారని సూచిస్తుంది.
క్రెడిట్ స్కోరు విషయంలో ఈఎంఐ-ఆదాయ నిష్పత్తి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మీ రుణాలు, క్రెడిట్ కార్డు చెల్లింపులు రెండూ కలిపి మీ ఆదాయంలో 50% మించి ఉంటే, బ్యాంకులు మిమ్మల్ని ఆర్థికంగా పరిమితికి మించి ఖర్చు పెట్టేవారిగా పరిగణిస్తాయి. ఇతర రుణాలతో పాటు, అదనంగా క్రెడిట్ కార్డుతో చేసిన ఖర్చులు తోడవడం వల్ల కూడా క్రెడిట్ స్కోరు ప్రభావితం అవుతుంది. అందుచేత, మీకు ఏవైనా రుణ బాధ్యతలున్నప్పుడు క్రెడిట్ కార్డులను మితంగా ఉపయోగించడం మేలు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.