Maruti Suzuki Flex Fuel Car: సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇంకా ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కార్ల తయారీ కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను లాంఛ్ చేస్తున్నాయి. ఒకవైపు ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్లో పోటీ పెరుగుతుండగా ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీ వచ్చేసింది. అదే ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీ. ఇక్కడ 85 శాతం వరకు ఇథనాల్ బ్లెండ్ చేసిన ఫ్యూయెల్ అన్నమాట. ఇది కూడా ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. భారత్.. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుందని కేంద్ర మంత్రులు చెబుతున్నారు. ఇటీవల దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారుగా పేర్కొంటున్న మారుతీ సుజుకీ ఫ్లెక్స్ ఫ్యూయెల్ వ్యాగన్ ఆర్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ 15 శాతం పెట్రోల్.. 85 శాతం ఇథనాల్ మిశ్రమంతో పనిచేస్తుంది. తద్వారా పెట్రోల్ ఖర్చు ఆదా అవుతుంది. మారుతీ సుజుకీ ఫ్లెక్స్ ఫ్యూయెల్ కార్లను లాంఛ్ చేయకముందే.. ద్విచక్రవాహన తయారీ దారు హీరో మోటోకార్ప్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజిన్ కలిగిన మోటార్ సైకిళ్లను కూడా విడుదల చేసింది. ఫ్లెక్స్ ఫ్యూయెల్కు సపోర్ట్ చేసే విధంగా స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురీ వీటిని ఆవిష్కరించారు. వీటి ధరలు వరుసగా రూ. 82,810; రూ. 72,792 గా ఉన్నాయి. ఇవి ఎక్స్ షోరూం రేట్లు. ఆన్ రోడ్ ప్రైస్ కాస్త ఎక్కువగా ఉంటుంది. e85 అంటే.. పెట్రోల్‌లో 85 శాతం ఇథనాల్ కలుపుతారు. ఇప్పటికే e20 ఫ్యూయెల్ పెట్రోల్ బంకుల్లో ఉండగా.. ఇప్పుడు ఫ్లెక్స్ ఫ్యూయెల్ వాహనాల కోసం మన దేశం E85 ఇంధనాన్ని ఆవిష్కరించింది. >> సాధారణ పెట్రోల్ కంటే లీటరుపైన రూ. 20 తక్కువకే ఈ ఇ- 85 ఫ్యూయెల్ అందుబాటులో ఉండటం విశేషం. అంటే ఇథనాల్ వెహికిల్స్‌కు మారితే ఇంధన ఖర్చు భారీగా తగ్గుతుందన్నమాట. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా శుక్రవారం రోజు ఇండియన్ ఆయిల్ విక్రయ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఈ కొత్త ఇంధనాన్ని విపణిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 48 పెట్రోల్ బంకుల్లో తొలి విడతగా దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది చివరి నాటికి 500 పెట్రోల్ బంకులు.. 2027 డిసెంబర్ నాటికి 5 వేల బంకుల్లో ఈ కొత్త ఇంధనాన్ని తీసుకొస్తామని చెప్పారు. పెట్రోల్‌లో 20-100 శాతం వరకు ఇథనాల్ కలిపినా.. పనిచేసే ఇంజిన్ల కోసమే ఈ కొత్త ఇంధనం వాడాల్సి ఉంటుంది.