
ఇంటర్నెట్‌డెస్క్: నటనలోనే కాదు, వంట చేయడంలోనూ చేయి తిరిగిన దిట్ట మన స్టార్ కథానాయకుడు ఎన్టీఆర్ (NTR). షూటింగ్‌ల నుంచి ఖాళీ సమయం దొరికితే కిచెన్‌లో చేరి వెరైటీ వంటలన్నీ చేస్తారు. ఆయన చేతి
బిర్యానీ, నాటుకోడి కూరకు ఇండస్ట్రీలో సెపరేట్‌గా అభిమానులే ఉన్నారు. అలాంటిది ఎన్టీఆర్ తొలిసారి కుకీస్ బేక్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టగా, అది వైరల్ అయింది.
సాధారణంగా ఎన్టీఆర్ సామాజిక మాధ్యమాల్లో పెద్దగా స్పందించరు. కానీ, అదే వీడియోను సాయితేజ అనే అభిమాని పంచుకుంటూ ‘మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. రెండు కుకీస్ పంపించు అన్నా’ అని ఎక్స్ వేదికగా కోరగా, వెంటనే స్పందించారు. ‘కింగ్’లో బ్రహ్మానందం వీడియోను పంచుకుంటూ ‘అడ్రస్ పెట్టు.. ఫాస్ట్‌గా అడ్రస్ పెట్టు’ అంటూ ఆడియోతో ఉన్న ఆ వీడియోతో రిప్లై ఇచ్చారు. ఎన్టీఆర్ నుంచి సమాధానం రాగానే సాయితేజ మాత్రమే కాదు, ఎన్టీఆర్ అభిమానులు ఆశ్చర్యపోయారు. ‘అన్నా జన్మ ధన్యమైంది. కాళ్లూ చేతులు వణుకుతున్నాయి. కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా’ అంటూ సాయితేజ తన అపార్ట్మెంట్ అడ్రస్‌ను పంచుకున్నారు.
మరొక అభిమాని అదే వీడియో ట్యాగ్ చేస్తూ, ‘బిర్యానీ, నాటుకోడి ఎక్కడ.. టైగర్ ఏంటీ కుకీలు..’ అని ఎన్టీఆర్‌ను అడగ్గా, ‘మారాయ్.. అన్నీ మారాయ్’ అంటూ ‘బాద్షా’లో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ వీడియోను పంచుకోవడం నవ్వులు పూయిస్తోంది. ఎప్పుడూ లేనిది ఎన్టీఆర్ ఇలా ఎక్స్ వేదికగా సమాధానం ఇవ్వడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నారు. ఇటీవల తారక్ పుట్టినరోజు సందర్భంగా పంచుకున్న టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.