
వైద్యనిపుణులకు తితిదే ఆహ్వానం ఐటీ అప్లికేషన్‌ను ఆవిష్కరించిన ఈవో ఎం.రవిచంద్ర వైద్యసేవ ఐటీ అప్లికేషన్‌ను ఆవిష్కరిస్తున్న తితిదే ఈవో ఎం.రవిచంద్ర. చిత్రంలో అదనపు ఈవో వెంకయ్యచౌదరి, జేఈవోలు శరత్
, వీరబ్రహ్మం, బర్డ్, స్విమ్స్ సంచాలకులు జగదీష్, ఆర్.వి.కుమార్, సీవీఎస్వో మురళీకృష్ణ
తిరుమల, న్యూస్‌టుడే: తితిదే ఆసుపత్రుల్లో ‘శ్రీవారి వైద్యసేవ’ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్‌ను ఈవో ఎం.రవిచంద్ర ఆవిష్కరించి మాట్లాడారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యనిపుణుల సేవలు శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంతి చంద్రబాబు ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రయోగాత్మక దశలో అమలు చేసి, వైద్యుల నుంచి అభిప్రాయాలు సేకరించాక మరింత మెరుగుపరుస్తాం. సూపర్‌స్పెషాలిటీ వైద్యనిపుణులు మూడు రోజులపాటు, ఎంబీబీఎస్ వైద్యులు ఏడు రోజులపాటు సేవ చేసే అవకాశం కల్పిస్తాం. వీరికి తిరుమల, తిరుపతిలో వసతి, భోజన సౌకర్యాలు అందిస్తాం. తిరుమల అశ్విని, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి తదితర తితిదే అనుబంధ సంస్థల్లో సేవలు అందించాల్సి ఉంటుంది. హిందూ మతానికి చెందిన వైద్యులు తితిదే వెబ్సైట్లో తమ స్లాట్ బుక్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు’ అని వెల్లడించారు.
హైదరాబాద్ ఐ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ వెంకటాచలం, సికింద్రాబాద్ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్ఏ శాస్త్రి, వైజాగ్ ఆంధ్ర మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్, బెంగళూరు ఈఎస్ఐ హాస్పిటల్ ఆర్థో హెచ్‌వోడీ డాక్టర్ పురుషోత్తం వర్చువల్‌గా హాజరై ఈవోతో మాట్లాడారు. తితిదే ఆసుపత్రుల్లో సేవలందించేందుకు అవకాశం కల్పించడం శ్రీవారి అనుగ్రహంగా భావిస్తున్నామన్నారు. అదనపు ఈవో వెంకయ్యచౌదరి, జేఈవోలు డాక్టర్ శరత్, వీరబ్రహ్మం, బర్డ్, స్విమ్స్ సంచాలకులు డాక్టర్ జి.జగదీష్, డాక్టర్ ఆర్.వి.కుమార్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.