
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ
మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Palamuru Lift Irrigation Scheme: 'మన భూములకు సాగునీళ్లు రాలేదు.. మన కష్టాలు తీరలేదు. దొంగలకు సద్దులు మోసెటోళ్లు నిన్నమొన్న పాదయాత్ర చేస్తామని మాట్లాడుతున్నారు. పాదయాత్ర కాదు.. కాశీదాక పొర్లు దండాలు పెట్టినా మీరు చేసిన పాపాలు తొలిగిపోవు' అని బీఆర్ఎస్ పార్టీ నాయకులపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో పని చేస్తున్నామని తెలిపారు.
జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రెండురోజులుగా జిల్లా రైతులకోసం సాగునీరు ప్రాజెక్టులను పరిశీలించా. వలసల కష్టాలు, ఆత్మహత్యల నష్టాలు మనకు తెలుసు. పాలమూరులో ఊరు లేకపోయినా.. పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వలసవచ్చిన కొందరిని ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఒక తల్లిగా ఇక ఏ తల్లికి గుండెకోత ఉండొద్దని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు' అని రేవంత్ రెడ్డి వివరించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు.
'పదేళ్లలో కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్… ఉద్దండపూర్ మునిగితే 800 కోట్లు ఇవ్వలేదు. ఇవ్వకపోగా నిర్వాసితులను జైల్లో పెట్టి కొట్టించాడు' అని వివరించారు. అందుకే మట్టికి పోయినా మనోడే పోవాలని పెద్దలు చెప్పారని.. పాలమూరు బిడ్డగా జిల్లాలో ప్రాజెక్టుల కోసం ఈ 30 నెలల్లో రూ.8 వేల కోట్లు ఖర్చు చేసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. 'జైళ్లు కట్టాలని వాళ్లు అనుకుంటే స్కూళ్లు కట్టాలని మనం అనుకున్నాం. ఏం చదవాలన్నా పాలమూరు జిల్లాకు వచ్చేలా కొడంగల్‌లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నాం. చదువొక్కటే మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది. పిల్లల్ని చదివించండి.. చదువుకుంటేనే బతుకులు బాగుపడతాయి' అని పేర్కొన్నారు.
ప్రాజెక్టులు పూర్తి కావాలి 'జిల్లాల్లో వలసలు ఆగాలన్నా, రైతులు సంతోషంగా ఉండాలన్నా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇందిరమ్మ ఇల్లు లేని గూడేలు లేవు. పాలమూరు ప్రజలు మట్టి తీసుడే కాదు మట్టితో కప్పడం కూడా తెలుసు' అని తెలిపారు. పాలమూరు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని ప్రకటించారు. జిల్లాలో ఒక్కరిని కూడా ఎమ్మెల్యేగా గెలవనీయం అని శపథం చేశారు. 'రేవంత్ రెడ్డి ఏం చేసిండని కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు. 15 లక్షల రేషన్ కార్డులు అందించాం. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం. రూ.పది వేల కోట్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు చేశాం' అని చిట్టా వివరించారు.
అడుగుతాం…కడుగుతాం 'గోదావరి జలాలపై చర్చిద్దామంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడుమూతలాడుతున్నారు. బీజేపీ నాయకులు తప్పించుకు తిరుగుతున్నారు. ఎన్నాళ్లు తప్పించుకు తిరుగుతారు? ఎవరు దాగుడుమూతలాడినా, తప్పించుకు తిరిగినా అడుగుతాం…కడుగుతాం.. తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మీరు బురద చల్లినా, తలకిందులుగా తపస్సు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి 90 టీఎంసీలకు ఒప్పించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేసే బాధ్యత తనదని తెలిపారు. 'పాలమూరు బిడ్డలు అప్రమత్తంగా ఉండాలి… దొంగలు వస్తారు… దోపిడీదారులు వస్తారు. దొంగలకు సద్దులు మోసెటోళ్లతో జాగ్రతగా ఉండండి. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం. 2029లో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం' అని రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.