
ఉదయం నిద్ర లేచాక మాత్రమే కాదు.. ఒత్తిడిగా, అలసటగా ఉన్నప్పుడు సైతం.. ఓ కప్పు టీ తాగనిదే బండి ముందుకెళ్లదు. ఇలా టీ ప్రతి ఒక్కరి జీవనశైలిలో ఓ భాగమే! అయితే దీన్ని ఎలా తీసుకుంటున్నాం, ఎప్పుడు
తీసుకుంటున్నామన్న దానిపైనే.. టీ వల్ల మనకు మేలు జరుగుతుందా? హాని కలుగుతుందా? అనేది ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు.
ఉదయం నిద్ర లేచాక మాత్రమే కాదు.. ఒత్తిడిగా, అలసటగా ఉన్నప్పుడు సైతం.. ఓ కప్పు టీ తాగనిదే బండి ముందుకెళ్లదు. ఇలా టీ ప్రతి ఒక్కరి జీవనశైలిలో ఓ భాగమే! అయితే దీన్ని ఎలా తీసుకుంటున్నాం, ఎప్పుడు తీసుకుంటున్నామన్న దానిపైనే.. టీ వల్ల మనకు మేలు జరుగుతుందా? హాని కలుగుతుందా? అనేది ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా టీకి సంబంధించిన కొన్ని అలవాట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపి వివిధ రకాల అనారోగ్యాల్ని తెచ్చిపెడతాయని హెచ్చరిస్తున్నారు. మరి, ఏంటా అలవాట్లు? తెలుసుకుందాం రండి..
⚛ ఉదయం నిద్ర లేచి బ్రష్ చేసుకోగానే టీ తాగుతుంటారు చాలామంది. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా పరగడుపునే టీ తీసుకోవడం వల్ల పొట్టలోని ఆమ్లాలు పైకి ఎగదోయడం, వికారం, పొట్టలో ఏదో తెలియని అసౌకర్యం.. వంటివి కలుగుతాయట! అందుకే ఏదైనా ఘనాహారం తిన్నాకే టీ తీసుకోవడం మేలంటున్నారు.
⚛ గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అయితే అది మితంగా తీసుకున్నంత వరకేనట. ఎక్కువ మొత్తంలో దీన్ని తీసుకోవడం వల్ల కాలేయంపై ప్రతికూల ప్రభావం పడుతుందట.
⚛ ప్రస్తుతం బరువు తగ్గించే టీలు, శరీరాన్ని డీటాక్స్ చేసే టీలు.. అంటూ ఎన్నో రకాలు మార్కెట్లోకొస్తున్నాయి. అయితే వీటి తయారీలో వాడే కొన్ని పదార్థాలు శరీరంపై వివిధ రకాలుగా ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, పొట్ట ఆరోగ్యం దెబ్బతినడం.. వంటి సమస్యలొస్తాయట! అందుకే వీటిని వాడే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదంటున్నారు.
⚛ వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడమే చాలామందికి ఇష్టం. కానీ 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి ఉన్న టీ తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి కాస్త చల్లారాక తీసుకోవడమే మేలంటున్నారు నిపుణులు.
⚛ రాత్రుళ్లు హాయిగా నిద్రపోయినప్పుడే శరీరం తనను తాను రిపేర్ చేసుకోగలుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యానికి ఈ దశ కీలకం. అయితే కొంతమంది నైట్షిఫ్టులని, ఎక్కువసేపు మెలకువగా ఉండాలని రాత్రి పూట టీ తాగుతుంటారు. దీనివల్ల నిద్రకు ఆటంకం కలిగి లేనిపోని అనారోగ్యాలకు దారితీస్తుంది.
⚛ వెరైటీగా ప్రయత్నించాలని కొంతమంది బబుల్ టీ రుచి చూస్తుంటారు. నిజానికి దీనిలో క్యాలరీలు, చక్కెరలు మోతాదుకు మించి ఉంటాయంటున్నారు నిపుణులు. ఫలితంగా పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
కాబట్టి టీ తాగే విషయంలో ఈ అంశాలు దృష్టిలో ఉంచుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే టీ మితంగా తీసుకోవడం, శరీరానికి పడకపోతే పక్కన పెట్టేయడం, అవసరమైతే నిపుణుల సలహాలు పాటించడం.. వంటివన్నీ ముఖ్యమే!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.