
‘తనువో చోట.. మనసో చోట..’ ఉంటే చేసే పనిలో సంతృప్తి దక్కదు. అందుకే మనసుకు నచ్చిన పనే చేయాలనుకుంటున్నారు జెన్‌జీ తరం అమ్మాయిలు. ఈ ఆలోచనతోనే కొంతమంది వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు.. విజయం
సాధిస్తున్నారు.
‘తనువో చోట.. మనసో చోట..’ ఉంటే చేసే పనిలో సంతృప్తి దక్కదు. అందుకే మనసుకు నచ్చిన పనే చేయాలనుకుంటున్నారు జెన్‌జీ తరం అమ్మాయిలు. ఈ ఆలోచనతోనే కొంతమంది వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు.. విజయం సాధిస్తున్నారు. సిక్కింకు చెందిన సెర్న్యా పాల్మో కూడా ఇదే కోవకు చెందుతుంది. మెడిసిన్ చదవడానికని దిల్లీ వెళ్లిన ఆమె.. తన కెరీర్ లక్ష్యం ఇది కాదని ఆ క్షణమే నిర్ణయించుకుంది. తమ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే కళలు, చేతివృత్తుల్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఓ హ్యాండీక్రాఫ్ట్స్ బిజినెస్‌ని ప్రారంభించింది. ఈ ప్రయత్నం ఆమెకు దేశవిదేశాల్లో గుర్తింపు తీసుకురావడమే కాదు.. రాష్ట్రపతి, ప్రధాని.. తదితరుల ప్రశంసలూ అందుకునేలా చేసింది.
సిక్కింలోని నమ్చీ అనే ప్రాంతంలో పుట్టి పెరిగింది పాల్మో. అక్కడ బౌద్ధమతం ప్రభావం ఎక్కువ. ఈ వాతావరణంలో పెరగడం వల్ల తానూ ఆధ్యాత్మికతను, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల్ని ఒంట బట్టించుకుంది. అయితే ఆమెది విద్యావంతుల కుటుంబం. ఈ క్రమంలోనే పాల్మో తల్లిదండ్రులు తన కూతురు బాగా చదువుకొని.. ఉన్నతోద్యోగం చేయాలని కోరుకున్నారు. వారి ఆశను వమ్ము చేయకుండా తానూ మెడిసిన్ చదవాలనుకుందట.
‘మెడిసిన్ ప్రవేశ పరీక్షకు సన్నద్ధమవడానికి దిల్లీ వెళ్లా. కష్టపడి చదివి పరీక్ష రాశాను.. సీటు కూడా వచ్చింది. కానీ ఒక్క క్షణం ఇది నా కెరీర్ లక్ష్యం కాదేమో అనిపించింది. వైద్య విద్యను ఎంచుకుంటే వ్యాపారం చేయాలన్న నా ఆశయం కనుమరుగవుతుందనుకున్నా. అందుకే మనసు మార్చుకున్నా. బీబీఏ చదవాలని నిర్ణయించుకున్నా. ఇదే విషయాన్ని ఇంట్లో చెబితే కోప్పడ్డారు.. వద్దని వారించారు. కానీ నా మనసు చెప్పిందే చేశా..’ అంటోంది పాల్మో.
తన రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలు, కళలంటే పాల్మోకు మక్కువ ఎక్కువ. క్రమంగా కనుమరుగవుతోన్న వాటికి ఆదరణ పెంచాలనుకున్న ఆమె.. ఈ ఆలోచనతోనే వ్యాపారం ప్రారంభించాలనుకుంది. ఈ క్రమంలోనే బీబీఏ పూర్తి చేసుకొని 2023లో ‘పాల్మో హ్యాండీక్రాఫ్ట్స్’ పేరుతో బిజినెస్ ప్రారంభించింది.
‘థాంగ్కా ఆర్ట్ ఇక్కడి ప్రత్యేకత. కాటన్ లేదా పట్టు వస్త్రంపై గీసే సంప్రదాయ బౌద్ధ చిత్రలేఖన పద్ధతి ఇది. బౌద్ధుల ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా చిత్రాల్ని గీయడం ఇందులో కనిపిస్తుంది. నా వ్యాపారం ద్వారా ఈ కళకు అటు దేశవ్యాప్తంగా, ఇటు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ తీసుకురావాలనుకున్నా. అలాగే ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా చెక్క వస్తువులు, వంట పాత్రలు తయారుచేస్తూ.. వాటిపై ఈ చిత్ర కళతో హంగులద్దుతున్నా. అంతేకాదు.. కస్టమర్ల అభిరుచులకు తగినట్లుగా చెక్కతో ఫర్నిచర్‌ని తయారుచేస్తూ.. వాటినీ ఆర్ట్ వర్క్‌తో అందంగా ముస్తాబు చేస్తున్నాం. ఇలా మా వద్ద తయారయ్యే వస్తువులన్నీ చేత్తో రూపొందించినవే. అయితే వీటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారుచేయడం కాకుండా.. ఆర్డర్లను బట్టి తయారుచేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. తద్వారా వినియోగదారుల అభిరుచులకే అధిక ప్రాధాన్యమిస్తున్నాం..’ అంటూ తన వ్యాపారం గురించి చెబుతోంది పాల్మో.
ఇలా తన వ్యాపారానికి కావాల్సిన ముడి సరుకును స్థానిక వ్యాపారుల నుంచి కొనుగోలు చేస్తోంది పాల్మో. ఇక వీటి తయారీ కోసం కొందరు కళాకారుల్ని తన సంస్థలో చేర్చుకున్న ఆమె.. ఈ కళను ఆసక్తి ఉన్న స్థానిక మహిళలు, యువతకు నేర్పుతోంది. ఇందుకోసం ప్రత్యేకమైన సెషన్స్, వర్క్‌షాప్స్ నిర్వహిస్తోంది. తద్వారా మరింతమందిని ఉపాధి దిశగా నడిపిస్తోంది పాల్మో. ఇలా తమ వద్ద తయారైన కళాకృతులను దేశ, విదేశాల్లో జరిగే ఎగ్జిబిషన్లలోనూ ప్రదర్శిస్తోందీ యువ ఆంత్రప్రెన్యూర్.
‘మాకు దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచే కాదు.. దక్షిణాసియా, యూరోపియన్ దేశాల నుంచీ తరచూ ఆర్డర్లొస్తుంటాయి. భవిష్యత్తులో మరిన్ని దేశాలకూ నా వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నా. ఇలా క్రమంగా వ్యాపారం వృద్ధి చెందడం చూస్తుంటే.. మెడికల్ సీటు కాదని వ్యాపారంలోకి రావాలని గతంలో నేను తీసుకున్న నిర్ణయం సరైందే అనిపిస్తుంది. మనసుకు నచ్చిన పని చేయడం, దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ఇతర దేశాలకు చాటడం సంతృప్తినిస్తోంది..’ అంటోన్న పాల్మో.. ఆయా వేదికలపై తన వ్యాపార ప్రయాణాన్ని పంచుకుంటూ.. యువతలో స్ఫూర్తి నింపుతుంటుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ.. తదితరులు సైతం పాల్మో ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.