
CMR Green IPO | దిల్లీ: నాన్-ఫెర్రస్ లోహాల రీసైక్లర్ అయిన సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ ఐపీఓకు (CMR Green IPO) ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. శుక్రవారంతో సబ్స్క్రిప్షన్ గడువు
ముగియగా.. 127 రెట్ల సబ్స్క్రిప్షన్ అందుకుంది. ముఖ్యంగా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించడంతో భారీ సబ్స్క్రిప్షన్ సాధ్యమైంది. ఐపీఓ కార్యకలాపాలు ఇటీవల దాదాపు స్తంభించిన వేళ.. సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ ఐపీఓ బంపర్ సబ్స్క్రిప్షన్ నమోదు చేయడం విశేషం.
రూ.631 కోట్ల ఐపీఓలో ఒక్కో ఈక్విటీ షేరు ధరల శ్రేణి రూ.182-192గా కంపెనీ నిర్ణయించింది. 2,30,43,930 (2.30 కోట్లు) షేర్లకు గానూ.. 2,92,75,44,594 (292 కోట్లు) షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. కేటగిరీలా వారీగా చూసుకుంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల (QIBs) కోటా 270.6 రెట్లు, నాన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ల (NII) కోటా 172.35 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 27.03 రెట్లు సబ్స్క్రిప్షన్ అందుకుంది. తొలిరోజే పూర్తి సబ్స్క్రిప్షన్ అందుకోవడం గమనార్హం.
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటికే రూ.188.44 కోట్లు సమీకరించినట్లు కంపెనీ వెల్లడించింది. పూర్తి ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో నిధుల సమీకరణ జరుగుతోంది. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయిస్తుండడంతో కంపెనీకి ఎలాంటి నిధులూ రావు. నాన్-ఫెర్రస్ లోహాల రీసైక్లర్ అయిన సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్‌కు దేశవ్యాప్తంగా 13 రీసైక్లింగ్ యూనిట్లు ఉన్నాయి. హోండా కార్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి సంస్థలు ఈ కంపెనీకి క్లయింట్లు. ఈ నెల 10న ఈ షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.