అక్కినేని నాగ చైతన్య కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన జోనర్స్, వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియాలిటీ వెంట పరుగులు తీయకుండా, కంటెంట్ కే ప్రాధాన్యతనిస్తూ
అక్కినేని నాగ చైతన్య కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన జోనర్స్, వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియాలిటీ వెంట పరుగులు తీయకుండా, కంటెంట్ కే ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఓటీటీ వరల్డ్ లోనూ అడుగుపెట్టారు. ఆయన ప్రధాన పాత్రలో 'దూత' అనే వెబ్ సిరీస్ రూపొందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'దూత 2' రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. 2023లో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ నేచురల్-హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'దూత'. ఇందులో నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలు పోషించారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శరత్ మరార్ నిర్మించిన ఈ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. దీనికి అనూహ్య స్పందన లభించింది. చైతూకి సక్సెస్ ఫుల్ ఓటీటీ డెబ్యూగా నిలిచింది. అప్పటి నుంచి 'దూత' సీజన్-2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రేజీ అప్డేట్ అందించారు. ఇవాళ శుక్రవారం (జూన్ 5) 'దూత' సెకండ్ సీజన్ ను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. దీనికి కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతులపై ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టారు. డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్, ప్రొడ్యూసర్ శరత్ మరార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ తో పాటుగా అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, 'దూత 2' సిరీస్ తో నాగ చైతన్య నిర్మాతగా మారుతున్నారు. ''దూత' సెకండ్ చాప్టర్ లోకి అడుగుపెడుతున్నాం. నిర్మాతగా మొదటి అడుగుతో నా ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ఈ శుభ తరుణంలో... ఇకపై అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. 'దూత 2' మ్యాజిక్ కోసం సిద్ధంగా ఉండండి'' అని నాగ చైతన్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా పూజా సెర్మనీకి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.నాగ చైతన్య - డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబోలో గతంలో 'మనం' వంటి కల్ట్ క్లాసిక్ మూవీతో పాటుగా 'థాంక్యూ' అనే ప్లాప్ సినిమా వచ్చింది. ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన 'దూత' సిరీస్ సక్సెస్ అవ్వడంతో, దాని సీక్వెల్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. మొదటి భాగంలో ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులతో పాటుగా మరికొంతమంది కొత్త పాత్రలు 'దూత 2'లో భాగం కాబోతున్నాయి.