
ఝరాసంగం, జూన్ 05 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిపై సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్ పాటిల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు
ఝరాసంగం, జూన్ 05 : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిపై సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు జగదీశ్వర్ పాటిల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయానికి వస్తున్న కోట్ల రూపాయల ఆదాయానికి, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి అస్సలు పొంతన లేదని ఆయన ఆరోపించారు. ఏడాదికి సుమారు నాలుగు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారని, అంతే మొత్తంలో ఖర్చులు కూడా చూపిస్తూ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
ఆలయంలో ప్రస్తుతం కనిపిస్తున్న అంతర్గత షెడ్లు, వెలుపల నిర్మించిన షెడ్లు, గర్భాలయం ముందు చేసిన గ్రానైట్ ఫ్లోరింగ్ వంటి శాశ్వత పనులన్నీ భక్తులే తమ సొంత విరాళాలతో స్వచ్ఛందంగా చేయించారని జగదీశ్వర్ పాటిల్ స్పష్టం చేశారు. ఆలయ నిధుల ద్వారా, పాలకమండలి ద్వారా జరిగిన అసలైన అభివృద్ధి ఏమిటని ఆయన ప్రశ్నించారు. స్థానికంగా పనిచేస్తున్న ప్రస్తుత ఈవో నిర్లక్ష్య వైఖరి వల్లే ఆలయ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మండిపడ్డారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) స్థానిక ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం వల్లనే ఆలయ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక నాయకులు, కొన్ని శక్తుల నుంచి వస్తున్న రాజకీయ లేదా సామాజిక ఒత్తిళ్లకు తలొగ్గి ఈవో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? అనే అనుమానాలను ఆయన వ్యక్తపరిచారు. స్థానిక బంధుత్వాలు, ఒత్తిళ్ల కారణంగానే ఆలయ ప్రయోజనాలను పక్కనబెట్టి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
గత మహాశివరాత్రి జాతర సందర్భంగా ఆలయ రథం గోపురం (శిఖరం) దెబ్బతిని నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు దానికి ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. కనీసం తాత్కాలిక ఏర్పాట్లు కూడా చేయకుండా రథాన్ని అలాగే వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో కొందరిని నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా సిబ్బందిగా నియమించారని దేవాదాయ శాఖ కమిషనర్‌కు స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఎలాంటి విచారణ జరపకపోవడం, చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ప్రశ్నించారు.
గతంలో ఆలయంలో అవినీతి అక్రమాలపై విసుగు చెందిన కొందరు భక్తులు ఆలయ ఈవో, అర్చకులపై చర్యలు తీసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.
అలాగే ఆలయంలో దళారులు, అనధికార పూజారులు రెచ్చిపోతున్నారని, స్థానిక నాయకుల అండదండలతో వీరు భక్తులపై దౌర్జన్యాలకు దిగుతూ, గుండాయిజం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అభిషేకాలు, అర్చనలు, వాహన పూజలు, చివరకు గుండం స్నానాల వద్ద కూడా రసీదులు ఇవ్వకుండా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ ఆలయ ఆదాయానికి గండి కొడుతున్నారని గతంలో మాజీ ఎంపీటీసీ ఆరోపించిన, దేవాదాయశాఖ పర్యవేక్షించలేదు కనీసం వారిపైనా చర్యలు కూడా తీసుకోలేదని గుర్తు చేశారు.
ప్రతి మహా శివరాత్రి మహోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన వివిధ రకాల పనులకు గాను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గతంలో టెండర్లు వేసేవారు. ఈ ఈవో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఎలాంటి టెండర్లు వేయకపోవడం వెనుక ఏమైనా మతలబు ఉందా? అని ప్రశ్నించారు. ఆలయ శ్రేయస్సు దృష్ట్యా ప్రస్తుత ఈవో తీరుపై సమగ్ర విచారణ జరిపి, అవసరమైన మార్పులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఆలయ ప్రక్షాళనకు, అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.