మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచి, సుఖదుఃఖాల్లో జీవితాంతం తోడుంటానని చేసిన బాసను ఒక భార్య అక్షరాలా నిజం చేసి చూపించింది.
మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచి, సుఖదుఃఖాల్లో జీవితాంతం తోడుంటానని చేసిన బాసను ఒక భార్య అక్షరాలా నిజం చేసి చూపించింది. భర్త ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు తన శరీరంలోని ఒక భాగాన్ని ఇచ్చి భర్త పాలిట నిజమైన ప్రాణదాతగా మారింది. కరీంనగర్ జిల్లా బీమారం మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన జమ్మికుంట మహేందర్, సుజాత దంపతులు. వీరికి పదేళ్ల లోపు వయసున్న ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ పోషణ కోసం, పిల్లల మంచి భవిష్యత్తు కోసం మహేందర్ ఉపాధి వెతుక్కుంటూ సౌదీ అరేబియా వెళ్లారు. కొన్నేళ్ల పాటు అక్కడ కష్టపడి సంపాదిస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో.. ఏడాది కిందట పని చేసుకుంటున్న చోటే మహేందర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అక్కడ ప్రాథమిక పరీక్షలు చేయించుకున్న అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో మహేందర్ రెండు మూత్రపిండాలు పూర్తిగా పాడైపోయాయని తేలింది. ఈ వార్త వినగానే భార్య సుజాత, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఒక వైపు చిన్న పిల్లలు, మరోవైపు భర్త అనారోగ్యం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.దిక్కుతోచని స్థితిలో, తీవ్ర నైరాశ్యంలో మహేందర్ గత 10 నెలల పాటు నిరంతరం డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెళ్లదీశారు. డయాలసిస్ వల్ల తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ కిడ్నీ మార్పిడి ఒక్కటే శాశ్వత పరిష్కారమని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో కిడ్నీ మార్పిడి కోసం అవయవ దాన సంస్థ జీవన్‌దాన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్కడ ఉన్న వెయిటింగ్ లిస్ట్ కారణంగా కిడ్నీ లభించాలంటే కనీసం నాలుగేళ్ల సమయం పడుతుందని తెలిసి ఆ కుటుంబం తీవ్ర నిరాశకు గురైంది. రోజురోజుకూ భర్త మహేందర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడం, డయాలసిస్ నరకాన్ని అనుభవించడం చూసి భార్య సుజాత చలించిపోయింది.ఎలాగైనా తన భర్తను బతికించుకోవాలనే పట్టుదలతో సుజాత తన కిడ్నీని ఇవ్వడానికి ధైర్యంగా ముందుకు వచ్చింది. మహిళలు కిడ్నీ ఇస్తే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వస్తాయనే అపోహలను ఆమె నమ్మలేదు. వైద్యులు అన్ని రకాల ఆరోగ్య, రోగనిరోధక పరీక్షలు నిర్వహించి సుజాత కిడ్నీ మహేందర్‌కు సరిపోతుందని ధృవీకరించారు. 20 రోజుల కిందట ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించి సుజాత కిడ్నీని మహేందర్‌కు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరూ వేగంగా కోలుకుంటున్నారు. భర్తకు కిడ్నీ దానంతో సుజాత 'అర్ధాంగి' అనే పదానికి నిజమైన నిర్వచనం ఇస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచింది.