2020 నాటి ఢిల్లీ అల్లర్ల వెనుక కుట్రకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టయిన ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ దాఖలు చేసిన తాజా బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
శనివారం ఇరుపక్షాల వాదనలను విన్న అదనపు సెషన్స్ జడ్జి సమీర్ బాజ్పాయ్, తీర్పు వెల్లడిని సాయంత్రానికి వాయిదా వేశారు.విచారణ ప్రారంభం కాకుండానే తాము సుదీర్ఘ కాలంగా జైలులో ఉన్నామని, ఇది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ తమ పిటిషన్లలో పేర్కొన్నారు. మారిన పరిస్థితుల్లో దృష్ట్యా, విచారణలో జాప్యం జరిగితే కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కూడా బెయిల్ మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల పలు కేసుల్లో స్పష్టం చేసిన విషయాన్ని వారు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన ఉత్తర్వులను వారు ఉదహరించారు.పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల క్రమంలో 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో 53 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ హింస వెనుక ప్రధాన కుట్రదారులుగా ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్లపై ఢిల్లీ పోలీసులు యూఏపీఏ, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.