
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు దర్యాప్తులో రోజురోజుకూ కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి.
సస్పెండ్ అయిన సీఐ నాగరాజు కస్టడీ కోరుతూ కోర్టులో దాఖలు చేసిన మెమోలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) పలు సంచలన అంశాలను వెల్లడించింది. కేసుకు సంబంధించిన కీలక సీసీటీవీ ఫుటేజ్ అందుబాటులో లేకపోవడంతో పాటు, వాటిని ధ్వంసం చేసి ఉండే అవకాశాన్ని ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించినట్లు SIT కోర్టుకు తెలిపింది.
దర్యాప్తులో భాగంగా పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మరకలను గుర్తించిన SIT, టెర్రస్‌పై లభించిన మరకలున్న లాఠీ, ఎముకల అవశేషాలు, కాలిపోయిన బూడిద, పాక్షికంగా కాలిన ఇనుప హ్యాండ్ గొలుసును స్వాధీనం చేసుకుంది. కొందరు సాక్షుల వాంగ్మూలాల ప్రకారం సాయికృష్ణ పోలీసు కస్టడీలోనే తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు గుర్తించినట్లు SIT పేర్కొంది. మృతదేహాన్ని ఏం చేశారనే అంశాన్ని తెలుసుకునేందుకు నాగరాజు కస్టడీ అవసరమని కోర్టును కోరింది.
మరోవైపు సస్పెండ్ సీఐ నాగరాజు కోర్టుకు లిఖితపూర్వకంగా లేఖ రాస్తూ తాను నిర్దోషినని, కేసులో తనను అన్యాయంగా ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. తనను బెదిరిస్తూ కస్టడీ కోరుతున్నారని, విచారణ అవసరమైతే న్యాయవాది సమక్షంలో నిర్వహించాలని కోర్టును అభ్యర్థించారు.
ఇదిలా ఉండగా, స్టేషన్‌లోని పాత సీసీటీవీ హార్డ్‌డిస్కులను తొలగించి వాటి స్థానంలో కొత్త హార్డ్‌డిస్కులు అమర్చినట్లు ఫోరెన్సిక్ విచారణలో తేలినట్లు SIT గుర్తించింది. సీసీటీవీ కాంట్రాక్టర్‌ను విచారించగా, అవి తాము అమర్చిన హార్డ్‌డిస్కులు కావని చెప్పినట్లు సమాచారం. బిల్లులు, ఇన్వాయిస్ల పరిశీలన అనంతరం కొత్త హార్డ్‌డిస్కులు కొనుగోలు చేసి పాతవాటిని మాయం చేసినట్లు SIT అనుమానిస్తోంది. ఈ కేసులో ఆధారాల ధ్వంసం, మృతదేహం అదృశ్యంపై దర్యాప్తు కొనసాగుతోంది.