Minister Jupalli Resignation Challenge : తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య అప్పుల వివాదం తీవ్రస్థాయికి చేరింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై గులాబీ బాస్ కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అసత్యాలు చెప్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అప్పుల లెక్కలపై ముఖాముఖి తేల్చుకునేందుకు బీఆర్ఎస్ నాయకులకు ఆయన సరికొత్త సవాల్ విసిరారు. అయితే శాంతిభద్రతల దృష్ట్యా మొదట అనుకున్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వేదికను కాస్తా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు మారుస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా సవాల్‌కు కట్టుబడి ఉన్నా.. ప్రెస్‌క్లబ్‌కు రండి!హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. అప్పులపై బహిరంగ చర్చకు తాను ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. "బీఆర్ఎస్ అప్పుల విషయంలో నేను చెప్తున్న లెక్కలు తప్పని నిరూపిస్తే.. నా ఎమ్మేల్యే పదవితో పాటు మంత్రి పదవికి కూడా తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా రాజీనామా ఛాలెంజ్‌కు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను" అని జూపల్లి పునరుద్ఘాటించారు. ఈ సవాల్‌ను స్వీకరించి అప్పుల చిట్టాపై చర్చించేందుకు బీఆర్ఎస్ నేతలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రావాలని మంత్రి బహిరంగంగా ఆహ్వానించారు.హరీష్ రావు అరెస్టుపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..!ఇదే సమయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు అరెస్ట్ కావడంపై జూపల్లి కృష్ణారావు స్పందించారు. "హరీష్ రావును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఆ వివరాలు నాకు తెలియదు. అందులో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు. మొదట హరీష్ రావు గన్‌పార్క్‌కు వస్తున్నానని ప్రకటించారు. అందుకే నేను కూడా చర్చ కోసం గన్‌పార్క్‌కు వస్తానని చెప్పాను. కానీ అక్కడ ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్చా వేదికను ప్రెస్‌క్లబ్‌కు మార్చడం జరిగింది" అని జూపల్లి వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు కేవలం ప్రచార ఆర్భాటాల కోసమే మాట్లాడుతున్నారని, నిజంగా వారికి నిబద్ధత ఉంటే ప్రెస్‌క్లబ్‌కు వచ్చి వాస్తవాలు మాట్లాడాలని మంత్రి డిమాండ్ చేశారు. సాయంత్రం 5 గంటలకు తాను అక్కడే ఉంటానని.. గులాబీ నేతల రాక కోసం ఎదురుచూస్తానని పేర్కొన్నారు.