
చరిత్రను కాపాడాల్సిన చోటే సిమెంట్ పూశారు. వేల ఏళ్ల వారసత్వాన్ని ఆధునిక నిర్మాణంలా మార్చేశారు. దీంతో పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక సంస్థ ‘యునెస్కో’ గట్టి హెచ్చరిక జారీ చేసింది.
సరిచేయకపోతే ప్రపంచ వారసత్వ హోదా కోల్పోయే ప్రమాదముందని స్పష్టం చేసింది.పాకిస్థాన్‌లోని ప్రాచీన తక్షశిల పురావస్తు సముదాయంలో జరిగిన పరిరక్షణ పనులపై యునెస్కో అభ్యంతరం వ్యక్తం చేసింది. మొహ్రా మొరాడు, సిర్కాప్ ప్రాంతాల్లో చేపట్టిన పనులు వారసత్వ కట్టడాల అసలైన స్వరూపాన్ని దెబ్బతీశాయని పేర్కొంది. ఈ మార్పులను వెంటనే సరిచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.పంజాబ్ పురావస్తు శాఖ ప్రాచీన గోడల మరమ్మతులకు సిమెంట్ వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని చోట్ల పాత గోడలను పడగొట్టి కొత్త నిర్మాణాలు చేపట్టారని, మరికొన్ని గోడల ఎత్తును కూడా పెంచారని వెల్లడైంది. దీంతో అసలు పురాతన నిర్మాణం, కొత్త నిర్మాణం మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని నివేదిక పేర్కొంది.ఇలాంటి జోక్యాలు ప్రపంచ వారసత్వ కట్టడాల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని యునెస్కో హెచ్చరించింది. ఈ మార్పులను సరి చేయకపోతే తక్షశిలను ‘డేంజర్ లిస్ట్’లో చేర్చుతామని తేల్చి చెప్పింది. అవసరమైతే ప్రపంచ వారసత్వ జాబితా నుంచి పూర్తిగా తొలగించే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. గతంలో జర్మనీలోని ఓ వారసత్వ కట్టడానికి కూడా ఇదే చర్య తీసుకున్నట్లు గుర్తుచేసింది.అయితే తాము పునర్నిర్మాణం చేయలేదని పాకిస్థాన్ అధికారులు చెబుతున్నారు. కట్టడాలు మరింత దెబ్బతినకుండా కాపాడేందుకు మాత్రమే పరిరక్షణ చర్యలు చేపట్టామని వివరణ ఇచ్చారు. ఇవి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే జరుగుతున్నాయని, పునర్నిర్మాణం అనే విమర్శలు సరికావని స్పష్టం చేశారు.