DMart Shares Crash: స్టాక్ మార్కెట్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అప్పటివరకు బాగా రాణించిన స్టాక్స్ ఒక్కసారిగా పడిపోవచ్చు. అదే విధంగా వరుసగా పతనం అవుతూ వచ్చిన షేర్లు పుంజుకోవచ్చు.
ఇలా ఏదైనా జరుగుతుంది. దీని వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. అందుకే కంపెనీల నుంచి వచ్చే చిన్న ప్రకటనల గురించి కూడా లోతుగా తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు ఇలానే భారత్‌లో ప్రముఖ సూపర్‌మార్కెట్, హైపర్‌మార్కెట్ చెయిన్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. ఇది డీమార్ట్ పేరిట రిటైల్ స్టోర్లను నిర్వహిస్తుంటుంది. దీని ఓనర్ దిగ్గజ పారిశ్రామిక వేత్త, ప్రముఖ పెట్టుబడిదారు రాధాకిషన్ దమానీ . ఇప్పుడు జులై 3న డీమార్ట్ షేర్లు ట్రెండింగ్‌లో నిలిచాయి. జులై 2న (గురువారం) రూ. 4187 వద్ద ముగిసిన డీమార్ట్ షేర్లు శుక్రవారం రోజు దాదాపు 2 శాతానికిపైగా నష్టంతో రూ. 4090 వద్ద ఓపెన్ అయ్యాయి. ఇదే ఇవాళ్టి గరిష్ఠ ధర కావడం గమనార్హం. అంటే అక్కడి నుంచి ఇంకా పడిపోతూ వచ్చిందన్నమాట. ఈ క్రమంలోనే వరుసగా పడిపోతూ ఇంట్రాడేలో ఒక దశలో చూస్తే ఏకంగా 5 శాతం వరకు తగ్గి రూ. 3,982.70 వద్ద కనిష్ఠ స్థాయిల్ని నమోదు చేసింది. ఇక్కడ చూస్తే ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 200 కుపైగానే పడిపోవడం గమనార్హం. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన వారికి భారీ నష్టాలు వచ్చాయి. >> ఇక ప్రస్తుతం వార్త రాసే సమయంలో చూస్తే ఉదయం 10.15 గంటలకు డీమార్ట్ షేరు సరిగ్గా 4.40 శాతం నష్టంతో రూ. 4005 స్థాయిలో ఉంది. మార్కెట్ విలువ రూ. 2.61 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 4949.50 గా ఉండగా, కనిష్ఠ ధర రూ. 3,529 గా ఉంది. డీమార్ట్ స్టాక్ శుక్రవారం సెషన్లో పతనం అయ్యేందుకు ఒక కారణం ఉంది. 2026, జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి బిజినెస్ అప్డేట్ పంచుకుంది. స్టాండలోన్ ప్రాతిపదికన ఆదాయం 15.1 శాతం వరకు పెరిగి ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో రూ. 18343.5 కోట్లుగా వచ్చినట్లు పేర్కొంది. ఇంకా సమీక్షా త్రైమాసికంలో కంపెనీ కేవలం 3 స్టోర్లను మాత్రమే యాడ్ చేసుకుంది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 503 కు చేరుకుంది. ఇక్కడ చూస్తే బ్రోకరేజీలు సహా మార్కెట్ అంచనాల్ని ఇది అందుకోలేకపోయిందని తెలుస్తోంది. ఇదే సమయంలో డెట్ సెక్యూరిటీల్ని జారీ చేయడం ద్వారా నిధుల్ని సమీకరించాలని కంపెనీ నిర్ణయించడం కూడా కొంత అనిశ్చితికి కారణమైంది. ఈ క్రమంలోనే అమ్మకాల ఒత్తిడితో స్టాక్ పడిపోతున్నట్లు తెలుస్తోంది. Disclaimer: పైన ఇచ్చింది సమాచారమే. పెట్టుబడులకు సిఫార్సు కానే కాదు. మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు.