
gurthukostunnayi review || వెబ్‌సిరీస్: గుర్తుకొస్తున్నాయి; నటీనటులు: విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, ప్రియదర్శని రామ్, శివన్నారాయణ, వివా రాఘవ, పవన్ సిద్ధు, గోదావరి గోపి, అనిష్...
gurthukostunnayi review || వెబ్‌సిరీస్: గుర్తుకొస్తున్నాయి; నటీనటులు: విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, ప్రియదర్శని రామ్, శివన్నారాయణ, వివా రాఘవ, పవన్ సిద్ధు, గోదావరి గోపి, అనిష్ కురువిల్ల, మేఘనా సునీల్, మధు,రామ్‌చరణ్, చక్రి, సిమన్ తదితరులు; సంగీతం: సుహాస్; సినిమాటోగ్రఫీ : రేహాన్ షేక్; ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి, వెంకటేష్ చుండూరు; నిర్మాత: శరత్ చంద్ర నాయుడు; దర్శకుడు: వినోద్ గాలి; స్ట్రీమింగ్ వేదిక: ఈటీవీ విన్
రఘునాథ్ (ప్రియదర్శిని రామ్) స్కూల్ ప్రిన్సిపల్. రూల్స్ అంటే రూల్సే. సంతోష్ (విరాజ్ అశ్విన్) చిన్నప్పటి నుంచే రఘునాథ్ కుమార్తె వైశాలి (యశశ్రీ రావు)ని ప్రేమిస్తూ ఉంటాడు. అనేక సవాళ్ల తర్వాత ఎట్టకేలకు రఘునాథ్ ఈ పెళ్లికి ఒప్పుకొంటాడు. పెళ్లి కుదిరిందన్న ఆనందంలో సంతోష్ తన చిన్ననాటి స్నేహితులు బొమ్మ ఆనంద్ (గోదావరి గోపి), గణేశ్ (వివా రాఘవ), శ్రీకాంత్ (పవన్ సిద్దు)లతో కలిసి బ్యాచిలర్ పార్టీ కోసం గోవాకు వెళ్తాడు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో సంతోష్ తన గతాన్ని మర్చిపోతాడు. కేవలం కొద్ది రోజుల కిందట జరిగిన సంఘటనలే అతడికి గుర్తుంటాయి. పెళ్లి ముందు ఇలా జరగడంతో సంతోష్ కుటుంబం స్నేహితులు ఆందోళనకు గురవుతారు. పెళ్లిలోపు పరిస్థితులు చక్కదిద్దడానికి రంగంలోకి దిగుతారు. మరి సంతోష్‌కు గతం గుర్తు చేయడానికి వాళ్లు ఏం చేశారు? అతడికి గతం గుర్తు లేదన్న విషయం బయటపడకుండా ఉండటానికి పడిన కష్టాలు ఏంటి? వైశాలి కుటుంబానికి ఈ నిజం తెలిసిందా? అన్నది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే!
మతిమరుపు కాన్సెప్ట్‌తో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నీ చక్కటి వినోదాన్ని పంచాయి. ఈ కాన్సెప్ట్‌కు లాజిక్‌లతో పనిలేదు. కొన్ని సన్నివేశాలు, మొత్తం కథను చెప్పినా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే, ఆ కథా వస్తువు చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, పాత్రలపై దాని ప్రభావం, వారి నటనే ఇందులో కీలకం. ఈ విషయంలో ‘గుర్తుకొస్తున్నాయి’దర్శకుడు వినోద్ మంచి మార్కులు కొట్టేశారు. సిరీస్‌ను ఆద్యంతం వినోదాత్మకంగా చూపించడమే కాకుండా, భావోద్వేగాలను మిళితం చేసి ప్రేక్షకుడికి చక్కటి అనుభూతిని పంచడంలో విజయం సాధించారు. సంతోష్ కుటుంబ, స్నేహం, ప్రేమ ఇలా అన్ని పాత్రలను పరిచయం చేస్తూ సిరీస్‌ను మొదలు పెట్టిన దర్శకుడు నెమ్మదిగా మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఆయా సన్నివేశాలు కాస్త నెమ్మదిగానే సాగుతాయి. గోవా ట్రిప్‌లో జరిగిన ప్రమాదంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఇక్కడి నుంచే అసలు కథ పట్టాలెక్కుతుంది. ముఖ్యంగా సంతోష్ గతం మర్చిపోయాడన్న విషయం బయటపడకుండా, వైశాలీ కుటుంబానికి ఆ విషయం తెలియకుండా కథను నడపాలన్న ఆలోచన నుంచి పాత్రలు పడే టెన్షన్, దాని నుంచి పుట్టే హాస్యం అలరిస్తాయి.
ముఖ్యంగా రెండు టైమ్లైన్ల మధ్య చూపిస్తూ కథ, కథనాలను నడిపించుకుంటూ వెళ్లారు. హీరో వర్తమానంతో పాటు, చిన్ననాటి జ్ఞాపకాలను చెబుతూ ఆ కాలానికి తీసుకెళ్లారు. అవన్నీ అలరిస్తాయి. అయితే, గతం కన్నా కూడా వర్తమానంలో జరిగే విషయాలు, కథానాయకుడు గతాన్ని మర్చిపోయాడన్న విషయాన్ని గుర్తు చేయడానికి స్నేహితులు పడే పాట్లపైనే దర్శకుడు దృష్టి పెట్టాడు. దీంతో మతి మరపు డ్రామా, దాని నుంచి వచ్చే కామెడీ హైలైట్ అయ్యాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందన్న టెన్షన్‌ను బిల్డ్ చేస్తూ వెళ్లిన విధానం బాగుంది. మొదటి మూడు ఎపిసోడ్లు నెమ్మదిగా సాగినా, నాలుగో ఎపిసోడ్ నుంచి కథ మలుపు తీసుకుంటుంది. కొత్త పాత్రలు తెరపైకి రావడం, కథానాయకుడి విషయం బయట పడకుండా అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఎదురయ్యే సవాళ్లు ఆసక్తికరంగా ఉంటాయి. అదే సమయంలో స్కూల్ రోజుల్లోని సంఘటనలను మళ్లీ సృష్టించే సన్నివేశాలు చక్కటి వినోదాన్ని పంచుతాయి. ఇక చివరి మూడు ఎపిసోడ్స్ సిరీస్ మరింత ఆసక్తికరం. ముఖ్యంగా చిన్ననాటి జ్ఞాపకాలతో సాగే సన్నివేశాలు ఆద్యంతం హృద్యంగా ఉంటాయి. సిరీస్ చూస్తున్న ప్రేక్షకులకు తప్పకుండా తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఇక చివరి ఎపిసోడ్లో చూపించే ఎమోషన్స్, ట్విస్ట్ రివీల్ చేసే తీరు మరింత భావోద్వేగభరితంగా ఉండటమే కాదు, అర్థవంతమైన ముగింపును ఇచ్చారు.
జ్ఞాపకాలను మర్చిపోయిన సంతోష్ పాత్రలో విరాజ్ అశ్విన్ నటన బాగుంది. తన నటన, హావభావాలతో ఆ పాత్రలో లీనమైపోయారు. యశశ్రీ తన పాత్రకు న్యాయం చేసింది.. ఇక ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో వివా రాఘవ, పవన్ సిద్ధు, గోదావరి గోపిలతో పాటు, శివన్నారాయణ నటన ఈ సిరీస్‌కు అదనపు బలాన్ని ఇచ్చింది. రోహిణి హట్టంగడి, రామ్‌లకు మంచి పాత్రలు దక్కడంతో వారి అనుభవాన్ని రంగరించి తెరపై కనిపించారు. సాంకేతికంగా సిరీస్ బాగుంది. దర్శకుడు వినోద్ మెమొరీలాస్ కాన్సెప్ట్ సరికొత్త ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. ఆ సన్నివేశాలన్నీ అలరిస్తాయి. ఉన్న పాత్రలతోనే ఈ కాన్సెప్ట్‌ను పెంచుకుంటూ వెళ్లి ఉంటే, బోరింగ్‌గా ఉండేది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు తెరపైకి తీసుకొస్తూ కథలో సంఘర్షణ తీసుకురావడం బాగా వర్కవుట్ అయింది. భావోద్వేగ సన్నివేశాల తనదైన శైలిలో ప్రజెంట్ చేశారు.
కుటుంబంతో చూడొచ్చా: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ అరగంటకు అటూ ఇటూగా మాత్రమే ఉంది. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.