
అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. అలాగని శాశ్వత మిత్రులూ ఉండరు. కేవలం స్వార్థ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. దీనికి చక్కటి ఉదాహరణగా..
Jul 3 2026 8:15 AM | Updated on Jul 3 2026 8:32 AM
అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. అలాగని శాశ్వత మిత్రులూ ఉండరు. కేవలం స్వార్థ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. దీనికి చక్కటి ఉదాహరణగా.. ఇప్పుడు తూర్పు ఆసియాలో నడుస్తున్న హైడ్రామాను చెప్పుకోవచ్చు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. ఇటీవల హఠాత్తుగా ఉత్తర కొరియాలో ల్యాండ్ అయ్యారు. ప్రపంచ మీడియా అంతా ఇప్పుడు ప్యాంగ్యాంగ్ వైపే చూస్తోంది. ఎందుకంటే, నిన్న మొన్నటి వరకు ఉత్తర కొరియా అంటే చైనాకు ఒక చిన్న ‘తోక దేశం’ లాంటిది. బీజింగ్ గీసిన గీతను కిమ్ సామ్రాజ్యం దాటదు అనేది ఒక అంచనా. కానీ.. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కథ పూర్తిగా రివర్స్ అయింది!
చైనా చేతిలో రిమోట్ పనిచేయట్లేదా? ఒకప్పుడు చైనా చేతిలో రిమోట్ కంట్రోల్లా ఉన్న ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్.. ఇప్పుడు ఏకంగా చైనాకే ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అటు రష్యాతో గుట్టుగా నడిపిన ఆయుధాల బేరం.. ఇటు అమెరికాను ముప్పుతిప్పలు పెడుతున్న వైనం.. వీటన్నిటి మధ్య చైనా అసహనం..! అసలు కిమ్ జోంగ్ ఉన్ ఆడుతున్న ఈ గ్లోబల్ మైండ్ గేమ్ ఏంటి? చైనా-రష్యాల మధ్య ఉత్తర కొరియా ఎలా నలిగిపోతోంది? లేక ఇద్దరినీ వాడుకుంటోందా? అనే ప్రశ్నలు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి.
జుచే నుంచి హత్యల వరకు.. ఈ గ్లోబల్ ఈక్వేషన్ అర్థం కావాలంటే.. మనం కొంచెం చరిత్ర పేజీల్లో వెనక్కి వెళ్లాలి. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, కిమ్ జోంగ్ ఉన్ తాత అయిన కిమ్ ఇల్ సంగ్.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌తో పోరాడిన గట్టి మిలిటరీ లీడర్. ఆయన దేశాన్ని ఏర్పాటు చేశాక 'జుచే' (Juche) అనే ఒక వింత సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. జుచే అంటే.. ‘స్వయం సమృద్ధి’ అని అర్థం. అంటే.. ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా బతకడం, అభివృద్ధి చెందడం. దాంతో.. ప్రపంచమంతా ఇండస్ట్రియల్ ఏజ్‌లో దూసుకుపోతుంటే.. ఉత్తర కొరియా మాత్రం ఒక చీకటి సామ్రాజ్యంగా మిగిలిపోయింది. ఎంతలా అంటే, రాజధాని ప్యాంగ్యాంగ్ మినహా దేశంలో దశాబ్దాల పాటు కరెంట్ కూడా లేని పరిస్థితి.
కట్ చేస్తే.. 1990ల్లో సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది. అప్పటివరకు రష్యా నుంచి కొరియాకు వస్తున్న సాయం ఆగిపోయింది. ఈ పరిణామాలతో కిమ్ ఇల్ సంగ్ ఒక ప్రాక్టికల్ నిర్ణయం తీసుకున్నారు. 'జుచే' వర్కవుట్ కాదని గ్రహించి, దక్షిణ కొరియాతో విలీనం కోసం చర్చలకు సిద్ధపడ్డారు. కానీ, అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ విలీనం జరిగితే తమ పదవులు ఊడిపోతాయని భయపడిన అక్కడి మిలిటరీ జనరల్స్.. కిమ్ ఇల్ సంగ్‌ను రహస్యంగా అంతమొందించారు. ఆ తర్వాత వచ్చిన కిమ్ జోంగ్ ఇల్.. కరడుగట్టిన కమ్యూనిస్ట్ భావజాలంతో బతికారు. ఆయన తెచ్చిన అనాలోచిత అగ్రికల్చర్ సంస్కరణల వల్ల దేశంలో ఏకంగా 20 లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోయారు.
కిమ్ హత్యాకాండ..! దేశాన్ని నాశనం చేస్తున్న కిమ్ జోంగ్ ఇల్‌ను చూసి మిలిటరీ జనరల్స్ అలర్ట్ అయ్యారు. తర్వాతి తరం అయినా ప్రపంచాన్ని చూసి నేర్చుకోవాలని.. అప్పట్లో చిన్న పిల్లోడైన కిమ్ జోంగ్ ఉన్ను స్విట్జర్లాండ్‌కు పంపించి చదివించారు. కానీ, అనుకోకుండా కిమ్ జోంగ్ ఇల్ చనిపోవడంతో.. కేవలం 20 ఏళ్ల చిరు ప్రాయంలోనే కిమ్ జోంగ్ ఉన్ దేశాధినేత అయ్యాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మిలిటరీ జనరల్స్ తన తాతను, తండ్రిని ఎలా వాడుకున్నారో కిమ్‌కు బాగా తెలుసు. అందుకే పవర్లోకి రాగానే.. తన తండ్రి కాలం నాటి పాత తరం జనరల్స్‌ను ఒక్కొక్కరినీ లేపేయడం మొదలుపెట్టాడు. సింగపూర్‌లో ఒకరిని చంపించాడు. రైల్వే మినిస్టర్‌ను ఏకంగా రైలు కిందే వేయించాడు. డిఫెన్స్ అటాచీని యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌తో షూట్ చేయించాడు. ఇలా భయోత్పాతం సృష్టించి.. టోటల్ పవర్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు కిమ్.
ఉత్తర కొరియాపై చైనా పెత్తనం కిమ్ అంతర్గతంగా పవర్ స్ట్రాంగ్ చేసుకున్నా.. ఎక్స్టర్నల్గా చైనా ఆధిపత్యం ఎక్కువైంది. 2017 సమయంలో.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. కిమ్‌ను బీజింగ్ పిలిపించుకుని తాతలా క్లాసులు పీకేవారు. చైనా మీడియా కూడా కిమ్‌ను ఒక చిన్న ప్రావిన్స్ లీడర్లా తక్కువ చేసి చూపించేది. ఇది ఈ యంగ్ డిక్టేటర్‌కు అస్సలు నచ్చలేదు. చైనా అహాన్ని దెబ్బకొట్టడానికి.. కిమ్ నేరుగా అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో చేతులు కలిపాడు. సింగపూర్, వియత్నాంలలో సమ్మిట్స్ జరిగాయి. అయితే, ట్రంప్ స్టేట్ డిపార్ట్మెంట్ బ్రీఫింగ్స్ సరిగ్గా చదవకపోవడం వల్ల.. ఆ చర్చలు ఫలించలేదు. అమెరికా చాప్టర్ క్లోజ్ అయింది.
కలిసొచ్చిన ఉక్రెయిన్ యుద్ధం చైనా ఒత్తిడి పెరుగుతోంది. మరి కిమ్ ఏం చేయాలి? సరిగ్గా అప్పుడే వచ్చింది ఉక్రెయిన్ యుద్ధం! 2022లో ఉక్రెయిన్‌పై యుద్ధం వల్ల రష్యా ఒంటరైంది. ఆయుధాల కొరత వచ్చింది. ఇదే అదనుగా కిమ్ రంగంలోకి దిగాడు. దశాబ్దాలుగా దాచి ఉంచిన కోట్ల కొద్దీ ఆర్టిలరీ షాట్స్‌ను రష్యాకు ట్రైన్ల ద్వారా పంపాడు. ఎంతలా అంటే, యుద్ధంలో రష్యా వాడిన ఆయుధాల్లో మూడింట ఒక వంతు ఉత్తర కొరియా అందజేసినవే..! అంతేకాదు.. ఏకంగా 10,000 మంది కొరియన్ సైనికులను రష్యా బోర్డర్లో రష్యా తరఫున యుద్ధం చేయడానికి పంపాడు. దీనికి ప్రతిఫలంగా రష్యా నుంచి కిమ్ ఏం తీసుకున్నాడో తెలుసా? అత్యాధునిక స్పేస్ టెక్నాలజీ..! ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ సాంకేతికత! దీనివల్ల ఇప్పుడు ఉత్తర కొరియా అమెరికాలోని ఏ మూలనైనా న్యూక్లియర్ మిసైల్‌తో కొట్టగల సామర్థ్యం సంపాదించింది. అంటే, కిమ్‌కు కావాల్సిన డబ్బు, ఎనర్జీ, టెక్నాలజీ అన్నీ ఇప్పుడు రష్యా ఇస్తోంది. దీంతో చైనా మీద ఆధారపడాల్సిన అవసరం కిమ్‌కు పూర్తిగా తప్పిపోయింది!
నో విలీనం.. ఇదీ అసలు మ్యాటర్. ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్యాంగ్యాంగ్ ఎందుకు వెళ్లారంటే.. తమ చేతుల్లోంచి జారిపోయి రష్యా గూటికి చేరిన కిమ్‌ను మళ్లీ లొంగదీసుకోవడానికి. కానీ కిమ్ మాత్రం ‘తగ్గేదే లే’ అంటున్నాడు. ఎలాంటి షరతులు లేకుండా సాయం చేస్తేనే ఓకే అని.. లేదంటే పొమ్మని నిర్మొహమాటంగా చెబుతున్నాడు. ఎందుకంటే కిమ్ ఈ ఏడాది ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమ రాజ్యాంగాన్ని మార్చేసి, "ఇకపై దక్షిణ కొరియాతో విలీనం అనే ముచ్చటే లేదు.. మాది విడిగా ఉండే ఒక స్వతంత్ర అణు దేశం" అని డిక్లేర్ చేసేశాడు. చైనా లాంటి ఒక గ్లోబల్ సూపర్ పవర్‌కే చుక్కలు చూపిస్తున్న కిమ్ జోంగ్ ఉన్.. రాబోయే రోజుల్లో ఆసియా పసిఫిక్ రీజియన్‌లో, ముఖ్యంగా గ్లోబల్ ఎకానమీలో ఎలాంటి అలజడి సృష్టిస్తాడో అని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు
హైదరాబాద్ నగరంలో ఓ మోస్తరు వర్షం (ఫొటోలు)
హైదరాబాద్ : రుచులు.. అద్భుతం : ఫుడ్– ఎ–ఫెయిర్– 2026 (ఫొటోలు)
సీఎం విజయ్ తండ్రి బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
బుల్లితెర డాక్టర్ బాబు సతీమణి ఖరీదైన కారు (ఫొటోలు)
మాన్సూన్ జ్ఞాపకాల్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)
క్రేజీ కపుల్ ఇద్దరు కలిసి ఏం చేశారో చూడండి
ఇలాంటి వాడు MLAనా! మాతో పెట్టుకుంటే.. అడ్వకేట్లు వార్నింగ్
పిచ్ మధ్యలోనే తిట్టుకున్నా SRH ప్లేయర్లు స్టంప్ మైక్ ఆడియో వైరల్
ఏంటి అన్న ఈ బూతు పురాణం.. పూలవర్తి నాని ఆడియో లీక్ ఏకిపారేసిన మహిళ