
కాకినాడలో ఉద్రిక్తత ఆసుపత్రికి, కోర్టుకు తరలిస్తుండగా జనసేన కార్యకర్తల అడ్డగింత పోలీసు వాహనంపై కోడిగుడ్లు విసిరిన గుర్తుతెలియని వ్యక్తులు మసీదుసెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: యూట్యూబర్ ప్రశ్న రావణ్...
కాకినాడలో ఉద్రిక్తత ఆసుపత్రికి, కోర్టుకు తరలిస్తుండగా జనసేన కార్యకర్తల అడ్డగింత పోలీసు వాహనంపై కోడిగుడ్లు విసిరిన గుర్తుతెలియని వ్యక్తులు
మసీదుసెంటర్(కాకినాడ), న్యూస్‌టుడే: యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు, అనంతరం కోర్టుకు తరలించే సందర్భంలో కాకినాడలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పిఠాపురం పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేసి, జడ్జి ముందు హాజరుపరచగా అర్ధరాత్రి బెయిలు మంజూరు చేశారు. ఆ వెంటనే మరో కేసులో పోలీసులు.. పిఠాపురం పట్టణ పోలీసుస్టేషన్ వద్ద బుధవారం అర్ధరాత్రి దాటాక రావణ్‌ను అరెస్ట్ చేశారు. కాకినాడ గ్రామీణం పరిధిలోని సర్పవరం ఠాణాకు తరలించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని ఓ పాఠశాలలో పిల్లల మధ్య గొడవను కులాల మధ్య ఘర్షణగా చిత్రీకరించేలా మాట్లాడటంపై సర్పవరం పోలీసులు 2025లో రావణ్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై అతడిని గురువారం మధ్యాహ్నం వరకు విచారించారు. అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని, అతడిని రక్షిస్తున్న పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో పోలీసు వాహనం ఎక్కే ముందు జనసేన కార్యకర్తలను చూసి నిందితుడు తన పిడికిలి బిగించి రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించాడు. వాహనం పోలీసుస్టేషన్ బయటకు రాగానే జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వారికి తోపులాట జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు జీపు ముందు భాగంపై కోడిగుడ్లు విసిరారు.
సర్పవరం పోలీసుస్టేషన్ వద్ద జనసేన కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట
నిందితుడిని పోలీసులు జీజీహెచ్‌కు కాకుండా పోలీసు రిజర్వ్లైన్లోని వైద్యాధికారి వద్ద పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కోర్టుకు తరలిస్తారని తెలుసుకుని జిల్లా పరిషత్ కూడలి వద్దకు జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసులు మరో మార్గంలో నిందితుడిని తీసుకెళ్తుండగా కార్యకర్తలు ఆ వైపు చేరుకుని, కోర్టు వద్దకు రాగానే వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోసారి ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేసి శ్రేణులను చెదరగొట్టారు. వాహనం కోర్టు లోపలకు వెళుతుండగా మరోసారి కొందరు కోడిగుడ్లు విసిరారు. ఎట్టకేలకు సాయంత్రం 4.40 గంటలకు రావణ్‌ను పోలీసులు కాకినాడలోని స్పెషల్ మొబైల్ కోర్టుకు తీసుకొచ్చారు. అప్పటికే కోర్టు సమయం అయిపోయింది. దీంతో జడ్జి నివాసానికి నిందితుడిని తీసుకెళ్లారు. జడ్జి ముందు హాజరుపరచగా రాత్రి వరకు వాదనలు కొనసాగాయి. అనంతరం నిందితుడికి బెయిల్ మంజూరైంది. రావణ్ బయటకు రాగానే ఇంకో కేసులో కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకొని, మచిలీపట్నానికి తరలించారు.
ఏలూరు నేరవార్తలు, మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై ఏలూరు మూడో పట్టణ పోలీసుస్టేషన్లో, మచిలీపట్నంలోని ఇనగుదురుపేట స్టేషన్లో గురువారం కేసులు నమోదయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించడం, కులాల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యాఖ్యలు చేశారంటూ రావణ్‌పై జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.