
Payment Passkey| ఇంటర్నెట్ డెస్క్: భారత డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో పాస్వర్డ్లు, ఓటీపీలు తప్పనిసరి. ఇవి సురక్షితమైనప్పటికీ కొన్నిసార్లు ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి.
అయితే, డిజిటల్ వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చేందుకు, మోసాలకు చెక్‌పెట్టేలా వీసా సంస్థ పేమెంట్ పాస్కీ విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై డివైజ్ పాస్వర్డ్, ఫేషియల్ రికగ్నైజేషన్ , ఫింగర్ ప్రింట్‌తోనే సులువుగా ఆన్లైన్ లావాదేవీలు జరపొచ్చు.
ఏఐ యుగానికి తగ్గట్టుగా పేమెంట్ పాస్‌కీని తీసుకొచ్చినట్టు భారత అండ్ దక్షిణాసియా వీసా గ్రూప్ మెనేజర్ సురేశ్ సేథీ తెలిపారు. ఆర్బీఐ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దీన్ని రూపొందించామన్నారు. సంప్రదాయ ఓటీపీ, పాస్‌వర్డ్‌ల కంటే బయోమెట్రిక్ విధానమే సురక్షితమన్నారు. ఫోన్ ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ లేదా డివైజ్ పిన్ల ద్వారానే డిజిటల్ లావాదేవీలు చేయొచ్చని తెలిపారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని.. పాస్కీ మరో సురక్షిత దశలోకి చేరుతుందన్నారు. ఇందుకోసం బ్యాంకులు, ఫినెటెక్ సంస్థలు, టెక్నాలజీ ప్రొవైడర్లతో వీసా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్‌తో కలిసి ఎంపిక చేసిన యూజర్లకు ఈ సదుపాయాన్ని భారత్‌లో గురువారం అందుబాటులోకి తెచ్చింది.
వినియోగదారులు తమ వీసా కార్డును తమ స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేయడానికి తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆపై ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఫోన్ అన్‌లాక్ చేసినట్లుగా మీ ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ఐడీ లేదా డివైజ్ పిన్ ఎంటర్ చేసి లావాదేవీని పూర్తి చేయొచ్చు. ఓటీపీలు కాకుండా అదనపు అథంటికేషన్ సదుపాయం ఉండాలని ఆర్బీఐ సూచించిన నేపథ్యంలో వీసా పాస్కీ సదుపాయాన్ని తీసుకొచ్చింది. మొబైల్ నెట్వర్క్ సమస్యల వల్ల ఓటీపీలు రాక పడే ఇబ్బందులూ పాస్ కీ ద్వారా తప్పనున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈపీఎఫ్ఓ రూల్స్ జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.