
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో విశిష్ట స్థానాన్ని కలిగిన ఫ్రాన్స్‌లోని లయోన్ నగరంలో ఉన్న ఇన్స్టిట్యూట్ లుమియర్ రాజమౌళిని...
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో విశిష్ట స్థానాన్ని కలిగిన ఫ్రాన్స్‌లోని లయోన్ నగరంలో ఉన్న ఇన్స్టిట్యూట్ లుమియర్ రాజమౌళిని ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా అక్కడి 'వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేకర్స్'పై ఆయన పేరుతో శాశ్వత స్మారక ఫలకాన్ని ప్రతిష్ఠించింది. ఈ గౌరవంతో ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మార్టిన్ స్కోర్సెస్సీ, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా వంటి దిగ్గజాల సరసన రాజమౌళి పేరు కూడా చేరింది.
భారతీయ దర్శకుడిగా ఆయనకు దక్కిన ఈ గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. జూలై 1, 2 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అనంతరం రాజమౌళి తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, "లుమియర్ మ్యూజియంను సందర్శించే అవకాశం నాకు లభించింది. అక్కడ నా సినిమాలు 'ఈగ', 'ఆర్ఆర్ఆర్' ప్రదర్శితమవుతున్న స్క్రీనింగ్ రూమ్‌కు వెళ్లిన సమయంలో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ థియరీ ఫ్రెమాక్స్ నన్ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అనంతరం నాకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి సినిమా పుట్టిన వీధికి తీసుకెళ్లారు" అని వివరించారు.
జక్కన్న మాట్లాడుతూ.. ''ఆ వీధిలో నడుస్తుండగా.. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుల పేర్లతో ఉన్న శాశ్వత ఫలకాలను చూపించారు. తర్వాత ఎరుపు రంగు వస్త్రంతో కప్పి ఉంచిన మరో ఫలకాన్ని థియరీ ఫ్రెమాక్స్ ఆవిష్కరించారు. అదిచూసి నమ్మలేకపోయాను. ఆ ఫలకంపై నా పేరు కనిపించగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాను. ఈ అరుదైన గౌరవానికి వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
ఇప్పటికే జక్కన్న ఖాతాలో ఎన్నో అంతర్జాతీయ గౌరవాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమాకు ఆస్కార్ సాధించిన జక్కన్న.. గ్రామీ అవార్డుతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు తెలుగు పరిశ్రమకు అందించారు. అంతకు మించి ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అన్న రేంజ్ కు ఇండస్ట్రీ వెళ్లడానికి రాజమౌళి నే కారణం. ఇక ఇటీవలే ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రముఖ సినీమాథెక్ ఫ్రాన్సైస్ థియేటర్లో రాజమౌళి పేరుతో ఒక శాశ్వత సీటును కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లుమియర్ అందించిన ఈ తాజా గౌరవంతో ఆయన అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరిగింది.
ఇక జూన్ చివరి వారం నుంచి జూలై మధ్య వరకు ఇన్స్టిట్యూట్ లుమియర్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలతో ప్రత్యేక రెట్రోస్పెక్టివ్ ప్రదర్శనలను నిర్వహిస్తోంది. ఈ ప్రదర్శనల ద్వారా ఆయన సినిమాలను అంతర్జాతీయ ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేస్తోంది. ప్రస్తుతం రాజమౌళి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో.. దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాతో రాజమౌళి ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో చూడాలి.