
ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లి, పన్నెండేళ్లుగా అక్కడే చిక్కుకుపోయిన తెలంగాణ వాసి చివరకు విగతజీవిగా స్వదేశానికి చేరుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెంది
న దుబ్బల దాసు అనే వ్యక్తి జూన్ 17న రియాద్‌లో గుండెపోటుతో మరణించాడు. భారత రాయబార కార్యాలయం, పలువురు సామాజిక కార్యకర్తల కృషితో అతడి మృతదేహాన్ని గురువారం ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు తరలించారు.కోనరావుపేట గ్రామానికి చెందిన దాసు, సరైన నివాస అనుమతి పత్రాలు, పాస్‌పోర్ట్ లేకపోవడంతో గత పన్నెండేళ్లుగా స్వదేశానికి తిరిగి రాలేకపోయాడు. రియాద్‌లోనే ఉంటూ చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతడికి భార్య, చదువుకుంటున్న కుమార్తె, కుమారుడు ఉన్నారు.దాసు మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు సౌదీలోని భారత రాయబార కార్యాలయం, గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ కమిటీ, సాటా ఈస్టర్న్ వంటి సంస్థలు సహకరించాయి. మహమ్మద్ ఫారూఖ్, అబ్దుల్ రఫిక్, రంజిత్, ముజమ్మిల్ వంటి సామాజిక కార్యకర్తలు ప్రత్యేక చొరవ తీసుకుని, అవసరమైన పత్రాలను సిద్ధం చేయించారు. ఎలైట్ ఫ్రైట్ ఫార్వార్డింగ్ సంస్థ ద్వారా మృతదేహాన్ని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు.