మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్య లక్ష్మీబాయిని ట్రాన్స్ఫర్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివాదం నెలకొంది.
ఇప్పటివరకు వ్యవసాయ శాఖ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన లక్ష్మీబాయిని.. డిపార్ట్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్స్కు బదిలీ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ బదిలీ ఉత్తర్వులపై తాజాగా మీడియాతో మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ .. ఇది అన్యాయమైన ట్రాన్స్ఫర్ అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వ్యక్తిగత సిబ్బందితో పాటు ఆయనకు కారు సౌకర్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సతీమణిని ట్రాన్స్ఫర్ చేయడంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం.. తన సతీమణి లక్ష్మీబాయిని బదిలీ చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ మార్కెటింగ్ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మీబాయిని.. డిపార్ట్మెంట్ ఆఫ్ కోపరేటివ్స్కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసింది.రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బదిలీలు చేస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కానీ.. తాము అన్నింటికీ తెగించిన తర్వాతే రాజకీయాల్లోకి అడుగు పెట్టామని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే మొదట తన సెక్యూరిటీని తగ్గించారని.. ఇప్పుడు తన భార్యను ట్రాన్స్ఫర్ చేశారని విమర్శించారు. తనకు భద్రతను తగ్గించడంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ తనకు పాక్షికంగా ఉపశమనం లభించిందని గుర్తు చేశారు. హైకోర్టులో తనకు రిలీఫ్ రావడంతో దాన్ని జీర్ణించుకోలేక.. రేవంత్ రెడ్డి సర్కార్.. తన సతీమణిని అన్యాయంగా టార్గెట్ చేసుకున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తన భార్యకు అసలే సంబంధం లేని వేరే డిపార్ట్మెంట్కు ఆమెను ట్రాన్స్ఫర్ చేశారని మండిపడ్డారు. బెదిరింపులు, కక్షసాధింపు చర్యలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని.. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి నిత్యం పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.