
దిల్లీ: ప్రవేశ పరీక్షల పేపర్ లీకేజీ ఘటనలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతోన్న వేళ.. వైద్య విద్య, ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కీలక మార్పులు చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.
ఈ ప్రవేశాలకు బోర్డు పరీక్షల మార్కులను కూడా పరిగణనలోకి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. 50 శాతం మార్కుల వెయిటేజీని (50 percent weightage in admissions) తీసుకొచ్చేలా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
‘‘మెడికల్, ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో ప్రవేశాల (Medical, Engineering Admissions) కోసం బోర్డు పరీక్షల్లో వచ్చిన మార్కుల నుంచి 50 శాతం వెయిటేజ్ తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నాం. సిలబస్‌కు మరింత అనుగుణంగా ప్రవేశ పరీక్షలను మార్చడం, కోచింగ్ సెంటర్లపై ఆధారపడటాన్ని తగ్గించడం, కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు క్రమంగా మారడం కోసం ఈ ప్రతిపాదనలు తీసుకొస్తున్నాం’’ అని సదరు వర్గాలు వెల్లడించాయి. ప్రవేశ పరీక్షల్లో పారదర్శక విధానాల అమలు కోసం గతేడాది కేంద్ర విద్యాశాఖ 9 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కమిటీ ‘మార్కుల వెయిటేజీ’ అంశంపై కసరత్తులు చేస్తోంది. దీనిపై రానున్న వారాల్లో కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించనుంది. అనంతరం విద్యావ్యవస్థలో ప్రవేశాలకు సంబంధించి కేంద్రం కీలక సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నీట్ (NEET), జేఈఈ (JEE) వంటి ఎంట్రెన్స్ టెస్టులను నిర్వహిస్తున్నారు. బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ప్రవేశ పరీక్షలు రాసి.. ఆ స్కోరు ఆధారంగా అడ్మిషన్లు సాధిస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో ఈ ప్రవేశ పరీక్షల్లో మూల్యాంకన లోపాలు బయటపడటం, పేపర్ లీకేజీ వంటి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. మరోవైపు, ఈ ప్రవేశ పరీక్షల్లో ర్యాంకుల కోసం విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై తీవ్రంగా ఆధారపడటం, మెరుగైన ర్యాంకులు సాధించలేక బలవన్మరణాలకు పాల్పడటం వంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్రం తాజా మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.