
ఐపీఎల్-2026లో సంచలన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత వికెట్‌కీపర్, మాజీ సెలెక్టర్ సబా కరీమ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
భారత అభిమానులతో పాటు ప్రపంచమంతా అతని ఆటను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తోందని అన్నాడు. త్వరలోనే భారత్ తరఫున మూడు ఫార్మాట్లలోనూ సూర్యవంశీ ఆడతాడని తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పాడు.ఐపీఎల్-2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన సూర్యవంశీ 776 పరుగులు చేసి, 237.30 స్ట్రైక్‌రేట్‌తో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ అద్భుత సీజన్ తర్వాత గుర్తుండిపోయే ఐపీఎల్ సీజన్ ఏదైనా ఉంటే అది సూర్యవంశీదేనని సబా కరీమ్ అభిప్రాయపడ్డాడు. అగ్రశ్రేణి బౌలర్లపై అతను ఆడిన తీరు అసాధారణమని కొనియాడాడు.ఐపీఎల్-2025 వేలానికి ముందే సూర్యవంశీ ప్రతిభ గురించి తనకు సమాచారం వచ్చిందని కరీమ్ గుర్తు చేసుకున్నాడు. అతడికి కనీసం ఒక మ్యాచ్‌లోనైనా అవకాశం రావాలని కోరుకున్నానని, తొలి బంతినే ధైర్యంగా ఎదుర్కొన్న తీరు తనను ఆశ్చర్యపరిచిందన్నాడు. ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఆడటమే సూర్యవంశీ ప్రత్యేకత అని చెప్పాడు.రెండో సీజన్లో బౌలర్లు అతడిపై ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తారనే అంచనాలు ఉన్నప్పటికీ, అలాంటి ఇబ్బందులు ఎదురుకావని తాను ముందే భావించానన్నాడు. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారని వెల్లడించాడు. వేగవంతమైన బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు సూర్యవంశీ తన ఆటలో అప్పర్కట్, కవర్స్ డ్రైవ్, ఇన్సైడ్-అవుట్ వంటి కొత్త షాట్లను జోడించాడని, ఏ పరిస్థితుల్లోనైనా రాణించే సామర్థ్యం అతనికి ఉందని ప్రశంసించాడు.