
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
KTR Challenge: మంత్రి జూపల్లి కోసం తెలంగాణ భవన్లో కుర్చీ వేసి వేచి చూసినా.. శాలువాతో సిద్ధంగా ఉన్నా ఆయన రాలేదు. గన్‌పార్క్ వద్ద చర్చకు రావడానికి కూడా నేను సిద్ధం. మేము అక్కడికి వెళ్దామని బయల్దేరితే పోలీసులను పెట్టి అరెస్టు చేస్తున్నారు. ఇక్కడ వేచి ఉంటే వాళ్లు తోక ముడిచారు. కాంగ్రెస్ మంత్రులు అక్కడ కూర్చుని తొడలు కొడితే ప్రయోజనం ఏమిటి?' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద గన్‌పార్క్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గన్‌పార్క్ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం. మంత్రి జూపల్లితో చర్చ కోసం గన్‌పార్క్ బయలుదేరితే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కంచన్‌బాగ్‌కు వెళ్లి అక్కడ అరెస్ట్ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను పరామర్శిద్దామని అనుకుంటే గేటు నుంచి అడుగు బయట పెట్టకుండా భారీగా పోలీసులను మోహరించారు' అని తెలిపారు.
'అక్కడ కూర్చుని మంత్రులు సవాళ్లు విసరడం.. ఇక్కడ పోలీసులతో మమ్మల్ని అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. చర్చించడానికి దమ్ము లేకనే రేవంత్ రెడ్డి, మంత్రులు వెన్నుచూపి పారిపోతున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 'సంక్షేమ శాఖలో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీశ్ రావు ఆరోపిస్తే గన్‌పార్క్‌కి మేము వస్తున్నాం, దమ్ముంటే రండి అని ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు సవాల్ చేశారు. ఆ సవాల్‌ను స్వీకరించి హరీష్ రావు బయలుదేరితే వాస్తవాలు బయట పడితే, ప్రజల ముందు పరువు పోతుందనే భయంతో పోలీసులను పంపించి అడ్డుకున్నారు' అని మంత్రుల తీరుపై అహసనం వ్యక్తం చేశారు.
'బీఆర్ఎస్ పార్టీ నాయకులతో బహిరంగ చర్చకు కూడా రాలేని కాంగ్రెస్ పిరికిపందలు, చేతకాని దద్దమ్మలు చర్చలకు సిద్దమని సవాళ్లు ఎందుకు వేయాలి?' మంత్రుల తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు మేమే వారికి ఎక్కువ అని తెలిపారు. 'తెలంగాణ భవన్‌కి వస్తానని ఫోజులు కొట్టమన్నది ఎవరు మళ్లీ గన్‌పార్క్ అని లొకేషన్ మార్చామన్నది ఎవరు? నీకంటే పోలీస్ వాళ్ల ఎస్కార్ట్ ఉంది. కానీ మమ్మల్ని ఏమో బైటకి పోతే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు.
'పోలీసులని ఎవరు పంపుతున్నారు.. ముఖ్యమంత్రా, లేదా మంత్రులా. చర్చలని మీరే పిలుస్తారు. మళ్లీ పారిపోయేది మీరే! చేతకాని వెధవలు ఎవరో ప్రజలు చూస్తున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. నిద్ర పోయేవాడిని లేపొచ్చు.. నిద్రని నటించేవాడిని ఎక్కడ లేపగలం అని మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 'రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం లేదు. గతంలో రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి మేము ప్రెస్‌క్లబ్‌కు వెళ్తే రాకుండా మొహం చాటేసి పారిపోయాడు. మరోసారి తెలంగాణ అప్పులపై రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే మేము సిద్దమని చెప్పాం.. మళ్లీ రాకుండా తోక ముడిచి పారిపోయాడు. మధ్యలో సందట్లో సడేమియా అని జూపల్లి దూరి తెలంగాణ భవన్‌కు వస్తానని డైలాగులు వేశాడు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.