
కథ, కాన్సెప్ట్ కొత్తగా ఉంటే భాష, దేశంతో పనిలేకుండా సినిమాను ఆదరిస్తారని నిరూపించింది ‘అబ్సెషన్’ (Obsession). ఒక మనిషి మనల్ని అతిగా ప్రేమించాలని కోరుకుంటే ఏమవుతుంది?
అనే భిన్నమైన కథాంశంతో తెరకెక్కిందీ సినిమా. ఈ సింపుల్ కథ బాక్సాఫీస్ వద్ద కోట్లు కుమ్మరించింది. కేవలం రూ.7కోట్లతో తీసిన ఈ సినిమా ఏకంగా రూ.3,500 కోట్లు సాధించింది. ప్రస్తుతం యాపిల్టీవీ+లో స్ట్రీమింగ్ అవుతోంది. అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘అబ్సెషన్’ ఎలాంటి థ్రిల్ పంచింది? యువతను ఎంతకంత నచ్చింది?
బారోన్ అలియాస్ బేర్ (మైఖేల్ జాన్స్టన్) మ్యూజిక్ స్టోర్ ఉద్యోగి. స్నేహితురాలు నిక్కీ ఫ్రీమెన్ (ఇండీ నవరెట్టే) అంటే ఎంతో ఇష్టం. ఆమెను ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తుంటాడు. ఎలా అయినా తనకు ప్రేమ గురించి చెప్పాలనుకుంటాడు. ఈ క్రమంలోనే కోర్కెలు నెరవేర్చే ఓ మ్యాజిక్ స్టిక్‌ని కొంటాడు. దాన్ని విరగొట్టి కోరిక కోరుకుంటే అది నేరవేరుతుంది. ‘ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నన్ను నిక్కీ ప్రేమించాలి’ అంటూ ఆ స్టిక్ విరగొడతాడు. ఆ మరుక్షణం నుంచే నిక్కీలో మార్పు మొదలవుతుంది. బేర్‌ను ప్రేమించడం ప్రారంభిస్తుంది. ఎంతలా అంటే.. బేర్‌తో ఎవరైనా ప్రేమగా మాట్లాడినా, అతడు దేనినైనా ఇష్టపడినా దాన్ని హతమార్చేంతగా ప్రేమిస్తుంది. (Obsession Story). అతడు ప్రతి క్షణం తనతోనే ఉండాలని కోరుకుంటుంది. మరి ఈ ప్రేమకథ చివరకు ఏమైంది? నిక్కీ అతిప్రేమ నుంచి బేర్ పడతాడా? అనేది తెలియాంటే సినిమా చూడాల్సిందే..!
అమ్మ ప్రేమలో లాలన, నాన్న ప్రేమలో బాధ్యత మనం చూసే ఉంటాం. ప్రేమికుల ప్రేమలో ఒకరిపై ఇష్టం, ఆరాధన ఉంటుంది. అయితే ఆ ప్రేమే ఒక మనిషిని బందీగా చేస్తే.. ‘నువ్వు నాకు మాత్రమే కావాలి’ అనే స్వార్థానికి దారితీస్తే.. అదే అబ్సెషన్. ప్రాణాలు తీసుకునేంత ‘ప్రేమ’ ఉన్న కథలు మనం చూశాం (Obsession Review). కానీ, ఇది ప్రాణాలు తీసేంత ప్రేమ కథ. ‘ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది’ ఓ సినిమా డైలాగ్ ఉంది. కానీ, ‘అబ్సెషన్’లో ఇంత ప్రేమ ఉండదు. ‘నువ్వు నన్ను తప్ప వేరెవరనీ ఇష్టపడకూడదు. వేరెవరూ నిన్ను ఇష్టపడకూడదు’ అన్న స్వార్థమే ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా నేటితరం కోరుకున్నది దక్కకపోతే, ఎలాంటి విపరీత చర్యలకు తెగబడుతోందో చూస్తూనే ఉన్నాం. ప్రేమ కాస్త పిచ్చిగా మారి, ప్రాణాలు తీసేంతవరకూ వెళ్తోంది.
యువత ప్రతిబింబించే కథ, కథనాలు ఉండబట్టే అందరికీ ‘అబ్సెషన్’ కనెక్ట్ అయింది. ‘అబ్సెషన్’లో పెద్ద పెద్ద యాక్షన్ సీన్లు ఉండవు. మంత్రముగ్ధులను చేసే వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు కూడా కనిపించవు. అయినా ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు. అంతలా స్క్రీన్‌ప్లేతో మేజిక్ చేశాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ పాత్రల ప్రవర్తన.. తర్వాత ఏం జరుగుతుందో అంచనా వేయలేని సన్నివేశాలతో సాగే, కథ, కథనాలు ఈ సినిమాకి ప్రధాన బలం. మొదటి ఇరవై నిమిషాలు సాధారణ రొమాంటిక్ కామెడీలా కనిపిస్తుంది. కథానాయకుడు కోరిక కోరడంతోనే అసలు కథ మొదలవుతుంది. కథ ముందుకు వెళ్లే కొద్దీ ‘అసలు సినిమా’ కన్పిస్తుంది. హారర్ కంటే ప్రేమికుల మధ్య మానసిక సంఘర్షణ బలంగా చూపించే సినిమా ఇది. ఒక దశ దాటిన తర్వాత ఈ భయంకరమైన ప్రేమకథ ఎలా ముగుస్తుందా? అని ప్రేక్షకుడిని తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తుంది. పతాక సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ ఉద్విగ్నానికి గురి చేస్తాయి. సినిమా అయిపోయిన తర్వాత బేర్, నిక్కీ పాత్రలు మనల్ని విడిచి వెళ్లడానికి కాస్త సమయం పడుతుంది.
నిక్కీ పాత్రలో ఇండీ నవరెట్టే నటన సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఒక క్షణం అమాయకంగా కనిపిస్తే, మరో క్షణం భయపెడుతుంది. తన నటనతో ప్రేక్షకుడిని కట్టిపడేసింది. హీరోగా చేసిన మైఖేల్ జాన్స్టన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మధ్య మధ్యలో చిన్న పాత్రలు తెరపై కన్పించినా.. కథ మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతుంది. లొకేషన్లు కూడా పెద్దగా ఉండవు. కేవలం ఒక ఇంట్లో జరిగే కథలా అనిపిస్తుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగానే అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడా భయపెడుతుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.