
ఒకవైపు ఇంటి పనులు.. మరోవైపు ఆఫీసు వర్క్‌తో చాలామంది మహిళలు తీరిక లేకుండా గడుపుతుంటారు. ఇలాంటివారిలో కొంతమంది తమ బద్ధకపు భర్తతో వేగలేకపోతారు.
ఒకానొక దశలో సహనం కోల్పోయి ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి.
ఒకవైపు ఇంటి పనులు.. మరోవైపు ఆఫీసు వర్క్‌తో చాలామంది మహిళలు తీరిక లేకుండా గడుపుతుంటారు. ఇలాంటివారిలో కొంతమంది తమ బద్ధకపు భర్తతో వేగలేకపోతారు. ఒకానొక దశలో సహనం కోల్పోయి ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతుంటాయి. మరి, ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..
‘నా భర్త ఇటున్న గిన్నె తీసి అటు పెట్టడు’ అని కొంతమంది మహిళలు వాపోతుంటారు. ఇలాంటి వారికి రివర్స్ సైకాలజీని అప్లై చేయాలంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా వారికి కొన్ని రకాల పనులు అప్పగించండి. ‘ఈ పనులు మీరు మాత్రమే చేయగలుగుతారు’ అని వారిని ప్రోత్సహిస్తూనే.. వారికి ‘సూపర్ హీరో’ టైటిల్ ఇవ్వండి. అయితే అన్ని సందర్భాల్లో మీ భర్త అవసరం మీకు ఉండకపోవచ్చు. కానీ, అవసరం లేకున్నా క్రమంగా ఆ పనులను వారికే అప్పగించడం ద్వారా వారు వాటిని తమ బాధ్యతగా భావించే అవకాశం ఉంటుంది. అలాగే వారు ఆ పనులు చేయడం ద్వారా మీరు, పిల్లలు ఎంత ఆనందపడుతున్నారో వారికి తెలియజేయండి. దాంతో వారు తమకిచ్చిన ‘సూపర్ హీరో’ ఇమేజ్ను కాపాడుకోవడానికి, మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఆ పనిని క్రమం తప్పకుండా చేసేందుకు ఆరాటపడడం ఖాయమంటున్నారు నిపుణులు.
కొంతమంది మహిళలు తమకు తాము సూపర్ ఉమన్‌గా భావిస్తుంటారు. ఈ క్రమంలో ఇంట్లో పని చేయడం, పిల్లలను చూసుకోవడం, ఆఫీసు పని.. ఇలా అన్ని రకాల పనులను భర్త సహకారం లేకుండా ఒక్కరే పూర్తి చేసుకుంటారు. దీనిని అదనుగా చేసుకొని కొంతమంది భర్తలు ‘ఎలాగూ పనులన్నీ తనే చేసుకుంటుంది కదా!’ అని విశ్రాంతి తీసుకుంటారు. దీనివల్ల క్రమంగా బద్ధకం వచ్చేస్తుంటుంది. మీరు కూడా అన్ని సందర్భాల్లో అన్ని పనులూ పూర్తి చేయలేరు. ఇలాంటప్పుడే అసలు సమస్య వస్తుంది. కాబట్టి, మీకు అన్ని పనులు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్ని పనులను మీ భర్తకు అప్పగించడం మంచిది. తద్వారా మీకూ కాస్త సమయం దొరుకుతుంది. మీ భర్తా బద్ధకాన్ని పక్కన పెట్టి బాధ్యతగా వ్యవహరిస్తారు.
ఎవరైనా సరే.. చేసిన పనికి ప్రశంసలు దక్కితే వారు తమ పనిని మరింత ఉత్సాహంగా పూర్తి చేస్తారు. భర్తల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. కానీ, కొంతమంది వారు చేసిన పనిలో తప్పులు వెతుకుతుంటారు. దీనివల్ల వారు చేసే పనుల్ని కూడా పక్కన పెట్టే అవకాశాలూ లేకపోలేదు. అందుకే పేచీ పెట్టుకోవడానికి బదులుగా వారు చేసిన పనిని ప్రశంసించడం లేదా వారికి ప్రేమతో ఓ కానుకివ్వడం.. వంటివి చేయడం వల్ల వారు సంతృప్తి పడడంతో పాటు మీకు మరింతగా సహాయం చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఇద్దరి మధ్య అనుబంధమూ దృఢమవుతుంది.
మారుతున్న జీవనశైలిలో భాగంగా ప్రతి ఒక్కరూ బిజీగా గడుపుతున్నారు. దాంతో భార్యభర్తల మధ్య మాట్లాడుకునే సమయం కూడా తగ్గుతోంది. కాబట్టి, ఏ పనైనా ఇద్దరూ పంచుకొని చేయండి. ఈ సమయంలో మనసులోని మాటల్నీ పంచుకోండి. ఫలితంగా పని త్వరగా పూర్తవ్వడమే కాదు.. ఇద్దరూ కలిసి ఇలా సమయం గడపడం వల్ల మీ దాంపత్య బంధమూ బలపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.