
నాలుగు పదుల వయసు వచ్చినా గ్లామర్‌క్వీన్‌గా కొనసాగుతున్న బాలీవుడ్ హీరోయిన్ ఇషా గుప్తా.. ఏడేళ్ల తర్వాత ‘ధమాల్ 4’తో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
‘ధమాల్’ ఫ్రాంఛైజీలో భాగంగా వస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, రితీశ్ దేశ్‌ముఖ్ తదితరులు కీలక పాత్రలు పోషించగా.. ఈమె ప్రాచీ మాల్రోట్కర్ పాత్రలో నటించింది.
గతంలో వచ్చిన ‘టోటల్ ధమాల్’లో ఇషా.. అతిథి పాత్రలో మెరిసింది. ఇప్పుడు ‘ధమాల్ 4’లో ఆమె పాత్రకు ప్రాధాన్యత మరింత పెరిగినట్లు తెలుస్తోంది.
చివరగా 2019లో ‘వన్ డే: జస్టిస్ డెలివర్డ్’లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. కానీ, వెబ్‌సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్ అంటూ బిజీగానే ఉంటోంది.
సినిమాలు మానేశాక.. రిజెక్ట్ ఎక్స్, నకాబ్, ఆశ్రమం వెబ్‌సిరీస్‌లతో ఆకట్టుకుంది. గతేడాది యోయో హనీసింగ్ ‘మానియక్’, జుబిన్ ‘ఇష్క్ మేరా’ మ్యూజిక్ వీడియోల్లో తళుక్కుమంది.
2007లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్‌గా నిలిచిన ఇషా.. 2012లో ‘జన్నత్ 2’తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే పలు అవార్డులు అందుకుంది. 2019 వరకు వరుస పెట్టి సినిమాలు చేసింది.
రామ్‌చరణ్-బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన వినేయ విధేయ రామ చిత్రంలోని ‘ఏక్ బార్..’ పాటలో ఇషా మెరిసింది. అంతకుముందు ‘యార్ ఇవన్’ అనే తమిళ చిత్రంలోనూ నటించింది.
సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఇషాకు ఇన్‌స్టాలో 1.73 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తన ఇన్‌స్టా ఖాతాలో గ్లామరస్ ఫొటోలే ఎక్కువగా కనిపిస్తాయి. ఆమె ఫిట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా.
దిల్లీలో పుట్టిన ఇషాకు హైదరాబాద్‌తో బంధం ఉంది. అదెలాగంటే.. తన తండ్రి ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కావడంతో ఆమె చదువు దిల్లీ, దెహ్రాదూన్, హైదరాబాద్‌లోనే సాగింది. తను తెలుగులో మాట్లాడగలదు.
హీరోయిన్ అవ్వాలన్న ఆశయం తనకి చిన్న వయసులోనే కలిగింది. మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసిన ఆమెకు యూకేలోని న్యూ క్యాస్టిల్ యూనివర్సిటీ ‘లా స్కాలర్షిప్’ ఆఫర్ చేసినా సినిమా కోసం దాన్ని తిరస్కరించింది.
నలభై ఏళ్లు వచ్చినా ఈమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ, 50 ఏళ్ల తర్వాత పిల్లలను కనాలని భావిస్తోంది. అందుకే, తన బంధువు సలహాతో 2017లోనే ఆమె తన అండాలను భద్రపర్చింది.