
హైదరాబాద్: సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజధాని హైదరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. గురుకులాల్లో అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులు సిద్ధమయ్యారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ తదితరులు గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులు ఎవరు వచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలని అన్నారు. మరోవైపు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన్ను వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి.
‘‘ మీరు చేసిన వ్యాఖ్యలు నిజమైతే చర్చకు రావాలి. హాస్టళ్లలో అవినీతి జరిగిందని కేటీఆర్, హరీశ్‌రావు, ప్రవీణ్‌కుమార్ ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలవి పచ్చి అబద్ధాలు. మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలందరికీ నిజం తెలియాలి. మొత్తం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా జరిపాం. నాలుగు శాఖల ఆధ్వర్యంలో పారదర్శకంగా టెండర్లు పిలిచాం. టెండర్లలో ఎవరైనా పాల్గొనవచ్చనే విషయం తెలియదా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు బాగుపడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులే చర్చకు రావాలని కోరుతున్నాం. పదేళ్లుగా మీరు చేసిన ప్రొక్యూర్మెంట్పై కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాం. అధికారిగా చేసిన ప్రవీణ్‌కుమార్ కూడా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఎవరో, ఏదో తప్పుడు సమాచారం ఇస్తే.. దానిపై మాట్లాడొద్దు’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ అప్పుల గురించి చర్చకు సిద్ధంగా ఉన్నట్లు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. ఈ మేరకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్‌కు వస్తానని మంత్రి జూపల్లి చెప్పారని, అందుకే కేటీఆర్ తెలంగాణ భవన్లో ఉంటారని హరీశ్‌రావు అన్నారు. మంత్రులతో చర్చించేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర నేతలతో కలిసి అమరవీరుల స్తూపం వద్దకు బయల్దేరారు. పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చర్చకు వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని హరీశ్‌రావు నిలదీశారు. ‘‘ హాస్టళ్లలో అవినీతి జరిగింది. అందుకే కాంగ్రెస్ మంత్రులు భయపడుతున్నారు. పోలీసులను పెట్టి అడ్డుకుంటే మీరు పారిపోతున్నట్లే లెక్క. గన్‌పార్క్‌కు నడుచుకుంటూ వెళ్తాం’’ అంటూ కారు దిగి నడిచి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. పోలీసు వలయాన్ని తోసుకుంటూ బీఆర్ఎస్ నేతలు ముందుకు వెళ్లడంతో హరీశ్‌రావుతోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.