
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు, కొనుగోలుదారులు కొనుగోలుకు సిద్ధమయ్యారు. కానీ ఇవాళ మార్కెట్ తెరుచుకోగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి.
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.3,770 పెరిగి రూ.1,44,550కు చేరుకుంది. ఇటీవల ధరలు కాస్త తగ్గడంతో కొనుగోలు చేయాలని ఎదురుచూసిన వారికి ఈ పెరుగుదల ఊహించని షాక్. 22 క్యారెట్ల బంగారం ధరపై 10 గ్రాముల ధర రూ.3,450 పెరిగి రూ.1,32,500కు చేరుకుంది. సింగపూర్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,960. దుబాయ్ మార్కెట్లో రూ.1,27,583గా ఉంది.
వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండిపై రూ.5వేలు పెరిగి రూ.2,50,000కు చేరుకుంది. అయితే బంగారంతో పోలిస్తే వెండి ధరల్లో పెద్ద ఎత్తున హెచ్చుతగ్గులు కనిపించలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడం వంటి అంశాల ప్రభావంతో బంగారం ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.