
ఇంటర్నెట్‌డెస్క్: అరేబియా సముద్రంలో గస్తీ కాస్తున్న అమెరికా ఎంహెచ్-60ఎస్ సీహాక్ హెలికాప్టర్ (US Seahawk helicopter) ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ఈ ఘటనలో అందులోని సిబ్బంది ఒకరు గల్లంతయ్యారు.
ఈ విషయాన్ని అమెరికా నేవీ ఫిఫ్త్ ఫ్లీట్ కూడా ధ్రువీకరించింది. ‘‘సముద్రంలో గల్లంతైన అమెరికా ఎయిర్ క్రూమెన్ కోసం మా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌పై దర్యాప్తు చేపట్టాము’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంతంలోని అమెరికా విమానవాహక నౌక యూఎస్ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ పై మోహరించిన హెలికాప్టర్ ఇది.
సముద్ర జలాలపై హెలికాప్టర్ ల్యాండింగ్ అత్యంత ప్రమాదకరం. అత్యంత నిపుణులైన పైలట్లకు కూడా ఇది కత్తిమీద సామే. సాధారణంగా హెలికాప్టర్ పైభాగం బరువుగా ఉండటం వల్ల అవి నీటిలో తల్లకిందులయ్యే ముప్పు చాలా ఎక్కువ. జూన్‌లో హర్మూజ్ వద్ద అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ కుప్పకూలింది. దీనిలో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అదే సమయంలో తాము అమెరికా డ్రోన్‌ను కూల్చినట్లు ఇరాన్ ప్రకటించడం ఈ ఘటనపై అనుమానాలను రేపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.