
IND vs ENG 1st T20 : డర్హామ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, భారత వీరులు ఇంగ్లాండ్ బౌలింగ్‌ను బ్రేక్ చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 189 పరుగుల భారీ స్కోరు సాధించి ప్రత్యర్థి ముందు 190 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఇంగ్లాండ్ తన ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ముందే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భారీ వర్షం కురిసింది. ఎంతసేపటికీ వాన తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఊహించని విధంగా ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈసారి కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ సంజూ శాంసన్ కేవలం 1 రన్ చేసి సాకిబ్ మహమూద్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే అదే ఓవర్లో మరో స్టార్ బ్యాటర్ ఈషాన్ కిషన్ దురదృష్టవశాత్తూ ఖాతా తెరవకుండానే రన్ అవుట్ రూపంలో వెనుతిరిగాడు. కేవలం 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి జట్టు తీవ్ర ఒత్తిడిలో పడిన సమయంలో, ఓపెనర్ అభిషేక్ శర్మ తన వినాశకర బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
అభిషేక్ శర్మ మైదానంలో సిక్సర్ల సునామీ సృష్టించి కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఆయన అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా, అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించుకున్నాడు. అభిషేక్ శర్మ మొత్తం 24 బంతులు ఎదుర్కొని 245 స్ట్రైక్ రేట్‌తో 4 భారీ సిక్సర్లు, 6 ఫోర్ల సహాయంతో 59 పరుగులు చేసి అవుటయ్యాడు.
కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్
అభిషేక్ శర్మకు తోడుగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికేసాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 82 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అభిషేక్ అవుటైన తర్వాత కూడా బాధ్యతాయుతంగా ఆడిన అయ్యర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో మెరిసాడు. ఆయన 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 68 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మాత్రం నిరాశపరిచాడు. ఆయన 13 బంతుల్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఆల్‌రౌండర్ శివమ్ దూబే క్రీజులోకి వచ్చి మైదానాన్ని నలువైపులా బాదేశాడు. దూబే కేవలం 21 బంతుల్లోనే 3 లాంగ్ సిక్సర్లు, 2 ఫోర్లతో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ కంటే ముందుగా హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపినప్పటికీ, ఆయన ఆడిన రెండో బంతికే సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3 వికెట్లు పడగొట్టగా, ఆదిల్ రషీద్, సామ్ కరన్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. భారత బ్యాటర్లు ఇంగ్లాండ్‌ను దంచికొట్టి 190 పరుగుల టార్గెట్ సెట్ చేసినా, వరుణుడు కరుణించకపోవడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయకుండానే మ్యాచ్ రద్దయి సిరీస్ మొదటి పోరు డ్రాగా ముగిసింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి