
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఇరాన్ మరోసారి అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
తమ కనుసన్నల్లో ఉండే ఇజ్రాయెల్‌ను నియంత్రించాలని, లేనిపక్షంలో తాము తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌ను అమెరికా "పెంపుడు శక్తి"గా అభివర్ణించిన ఇరాన్, ఆ దేశ చర్యలకు వాషింగ్టన్‌దే పూర్తి బాధ్యత అని తేల్చిచెప్పింది.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి తీవ్రంగా స్పందించారు. ఇరాన్ సుప్రీం లీడర్‌కు మరణశిక్ష విధించాలన్న కాట్జ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ ప్రాంతంలో ఘర్షణలను నివారించేందుకు కుదిరిన 14 పాయింట్ల అవగాహన ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్‌ను అదుపులో ఉంచాల్సిన బాధ్యత అమెరికాపై ఉందని అరాఘ్చి గుర్తుచేశారు. అవసరమైతే ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం చెబుతామని ఆయన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.ఈ హెచ్చరికల నేపథ్యంలో, అమెరికా-ఇరాన్ మధ్య ఖతార్ రాజధాని దోహాలో పరోక్ష దౌత్య చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఖతార్, పాకిస్థాన్ ఈ చర్చల్లో మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. అమెరికా ప్రతినిధులు నేరుగా పాల్గొననప్పటికీ, ప్రాథమిక అంశాలపై ఖతార్ ప్రధానితో చర్చలు జరిపినట్లు సమాచారం.