
వాహన ప్రమాద ఘటనల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉద్యోగులు, వ్యాపారుల విషయంలో స్పష్టత దిల్లీ: వాహన ప్రమాదాల ఘటనల్లో ఏకరూప పరిహార చెల్లింపుల కోసం సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది.
మృతుల కుటుంబాలకు, గాయపడిన వ్యక్తులకు అందజేసే పరిహారాన్ని నిర్ణయించడంలోని అస్పష్టతలను తొలగిస్తూ మార్గదర్శకాలను వెలువరించింది. ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్)ల ఆధారంగా బాధితుల వార్షికాదాయాన్ని నిర్ధారించవచ్చని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. నెలవారీ జీతాలు పొందే ఉద్యోగుల విషయంలో అయితే వారు అంతకుముందు ఏడాది సమర్పించిన ఐటీఆర్ ఆధారంగా పరిహారాన్ని అంచనా వేయవచ్చని తెలిపింది. స్వయం ఉపాధి/వ్యాపార రంగంలోని వ్యక్తుల విషయంలో గత మూడేళ్లలో వారు సమర్పించిన ఐటీఆర్‌ల సగటును పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది.
మోటారు వాహన చట్టంలో వార్షిక ఆదాయం లెక్కింపునకు కచ్చితమైన ఫార్ములా ఏమీ లేదని ధర్మాసనం తెలిపింది. అయితే, ఉద్యోగులు, స్వయంఉపాధి పొందే వ్యక్తుల విషయంలో ఐటీఆర్‌ల ఆధారంగా పరిహారాన్ని నిర్ణయించవచ్చని చట్టం స్పష్టంగా పేర్కొందని వెల్లడించింది. బీ గత ఏడాది ఐటీఆర్‌ల ఆధారంగా పరిహారం నిర్ణయించడమే సబబని సుప్రీం ధర్మాసనం తెలిపింది. అయితే. ప్రమాద ఘటనకు కొన్నాళ్ల ముందునాటి తాజా పదోన్నతుల లేఖలను, మరేదైనా ఆర్థిక ప్రయోజనాల ఆధారాలను కూడా కోర్టులు అదనంగా పరిశీలనలోకి తీసుకోవచ్చని వెల్లడించింది. బీ స్వయంఉపాధి పొందుతున్న వ్యక్తులు, వ్యాపారుల విషయంలో మూడేళ్ల ఐటీఆర్‌లను పరిగణనలోకి తీసుకోవడం సముచితమని తెలిపింది.
శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా నిర్మాణరంగ వ్యాపారి రష్మీరేఖా త్రిపాఠి కుటుంబ సభ్యులు దాఖలు చేసిన అప్పీల్‌ను పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. బాధిత కుటుంబానికి చెల్లించాల్సిన పరిహారం మొత్తాన్ని రూ.1.87 కోట్ల నుంచి రూ.1.97 కోట్లకు పెంచింది. ఏడాదికి 6శాతం వడ్డీ చెల్లించాలనీ స్పష్టం చేసింది.
వారి మృతికీ పరిహారం చెల్లించాలి: ట్రైబ్యునల్
ఠాణె: ట్రక్కు కింద పడి మృతి చెందిన 8 నెలల చిన్నారి విషయంలో ఠాణేలోని మోటారు ప్రమాద వ్యాజ్యాల ట్రైబ్యునల్(ఎంఏసీటీ) కీలకమైన తీర్పు ఇచ్చింది. ఆ చిన్నారిని ఆర్జనలేని వ్యక్తిగా భావించరాదని పేర్కొంది. బాధిత తల్లిదండ్రులకు పరిహారంగా రూ.15.10లక్షలు చెల్లించాలని ఎంఏసీటీ ఛైర్మన్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఆర్.డి.సావంత్ ఆదేశించారు. ట్రక్ యజమాని, ప్రైవేట్ బీమా కంపెనీ సంయుక్తంగా ఈ మొత్తాన్ని అందజేయాలని స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.