
మీరు పప్పు ఎలా వండుతారు? అనడిగితే.. నానబెట్టి ఉడికిస్తామంటారు కొందరు. లేదు నానబెట్టకుండానే కుక్కర్లో వేసేస్తామంటారు మరికొందరు.. ముందుగా నూనె/నెయ్యిలో వేయిస్తే రుచి పెరుగుతుందంటారు ఇంకొందరు.
అయితే ఇలా ఎవరికి నచ్చినట్లుగా వారు పప్పుల్ని వండుకోవడం వల్ల వాటిలోని పోషకాలు నశించిపోయే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
మీరు పప్పు ఎలా వండుతారు? అనడిగితే.. నానబెట్టి ఉడికిస్తామంటారు కొందరు. లేదు నానబెట్టకుండానే కుక్కర్లో వేసేస్తామంటారు మరికొందరు.. ముందుగా నూనె/నెయ్యిలో వేయిస్తే రుచి పెరుగుతుందంటారు ఇంకొందరు. అయితే ఇలా ఎవరికి నచ్చినట్లుగా వారు పప్పుల్ని వండుకోవడం వల్ల వాటిలోని పోషకాలు నశించిపోయే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ నష్టం లేకుండా ఉండాలంటే వీటిని ఆరోగ్యకరంగా వండే పద్ధతులు తెలుసుకోవాలంటున్నారు. అవేంటో చూద్దాం రండి..
పప్పుతో చేసిన కూరల్ని చాలామంది ఇష్టంగా తింటారు. ప్రొటీన్, ఫైబర్, ఇతర అత్యవసర పోషకాలతో నిండిన ఈ ధాన్యాలు.. గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయుల్ని క్రమబద్ధీకరించడానికి, జీర్ణశక్తికి, బరువును నియంత్రణలో ఉంచడానికి.. ఇలా ఎన్నో రకాలుగా తోడ్పడతాయి. మరి, ఇవన్నీ పొందాలంటే వీటిలోని పోషకాలు తరిగిపోకుండా వండుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు.
‘ఎలాగూ కుక్కర్ ఉంది కదా.. ఉడికిపోతుంది’ అన్న ఆలోచనతో కొందరు పప్పుల్ని కడిగిన వెంటనే కుక్కర్లో వేసేస్తుంటారు. కానీ ఈ పద్ధతి వల్ల అందులోని పోషకాలు శరీరానికి అందవంటున్నారు నిపుణులు. ఎందుకంటే పప్పుల్లో సహజంగానే ఫైటేట్స్ అనే సమ్మేళనాలుంటాయట. ఇవి ఈ ధాన్యాల్లో ఉండే పోషకాలతో దృఢమైన బంధాన్ని ఏర్పరచుకొని.. వాటిని శరీరానికి అందకుండా అడ్డుపడతాయట. అదే పప్పుల్ని నానబెట్టడం వల్ల ఈ బంధాలు విచ్ఛిత్తి చెందుతాయి. తద్వారా పోషకాల్ని శరీరం సులభంగా గ్రహిస్తుంది. అంతేకాదు.. ఈ ధాన్యాలు త్వరగా ఉడకడంతో పాటు సులభంగా జీర్ణమవుతాయనీ అంటున్నారు నిపుణులు. కాబట్టి పప్పుల్ని వండే ముందు నానబెట్టడం మంచిదని చెబుతున్నారు. ఈ క్రమంలో పెసరపప్పు - గంట; కంది పప్పు, ఎర్ర పప్పు - రెండు గంటలు; శెనగ పప్పు, మినపప్పు - రాత్రంతా; రాజ్మా, శెనగలు, బొబ్బర్లు.. వంటి వాటిని - 12 గంటల పాటు నానబెట్టుకొని వండుకోవడం వల్ల వాటిలోని పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయంటున్నారు నిపుణులు.
పప్పును కుక్కర్లో వేసి ఎక్కువ విజిల్స్ రానిస్తుంటారు కొందరు. తద్వారా అది పూర్తిగా మెత్తబడడంతో పాటు అందులోని పోషక విలువలూ తగ్గిపోయే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. పప్పుల్లోని ప్రొటీన్ సున్నితమైన అమైనో ఆమ్లాల నిర్మాణాలతో కూడి ఉంటుంది. ఎక్కువ సమయం ఉడికిస్తే అధిక వేడి వల్ల ఈ నిర్మాణాలు విచ్ఛిత్తి చెంది.. ప్రొటీన్లు నశించిపోయే అవకాశం ఎక్కువంటున్నారు. కాబట్టి ఆయా పప్పుల్ని కుక్కర్ లేదా సాధారణ గిన్నెలో నిర్ణీత సమయం పాటు ఉడికించడం మేలంటున్నారు.
⚛ పెసరపప్పును కుక్కర్లో వేస్తే మూడు విజిల్స్ రానివ్వాలి. అదే గిన్నెలో అయితే పది నిమిషాలు ఉడికిస్తే చాలట.
⚛ కంది పప్పును కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. గిన్నెలో అయితే (ఒక లోతైన ప్లేట్లో కొన్ని నీళ్లు పోసి మూత పెట్టడం) అరగంట పాటు ఉడికిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు.
⚛ ఎర్రపప్పు కుక్కర్లో అయితే 1-2 విజిల్స్, గిన్నెలో పది నిమిషాల్లో ఉడికిపోతుందట.
⚛ శెనగపప్పు కుక్కర్లో ఐదు విజిల్స్ వచ్చే దాకా, గిన్నెలో అరగంట పాటు ఉడికించుకోవడం మేలంటున్నారు నిపుణులు.
⚛ ఇక మినపప్పు అయితే కుక్కర్లో వేసి 4 విజిల్స్, గిన్నెలో వేసి పావు గంట పాటు ఉడికిస్తే సరిపోతుందట.
కొంతమంది పప్పు త్వరగా ఉడకాలని బేకింగ్ సోడా వేస్తుంటారు. అయితే దీన్ని ఎక్కువగా వాడడం వల్ల పప్పులో క్షార స్వభావం పెరిగి చేదెక్కుతుందట. పైగా ఇందులో ఉండే సహజ ప్రొటీన్లూ దెబ్బతినే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి దీన్ని వాడకపోవడమే మంచిదంటున్నారు.
ఇదొక్కటే కాదు.. ఉప్పు, టొమాటో ముక్కలు, చింతపండు రసం, నిమ్మరసం.. వంటివి పప్పు పూర్తిగా ఉడికిన తర్వాతే కలపడం వల్ల.. పప్పు మెత్తగా ఉడకడంతో పాటు పప్పులోని పోషకాలు తరిగిపోకుండానూ జాగ్రత్తపడచ్చంటున్నారు. అంతేకాదు.. పప్పు తన సహజ రుచిని కోల్పోకుండానూ ఉంటుందంటున్నారు.
కాయగూరలు ఉడికించిన నీటిని పడేయడం చాలామందికి అలవాటే! అలాగే పప్పు ఉడికించిన నీటినీ వడకట్టి పడేస్తుంటారు కొందరు. నిజానికి ఈ రెండు పద్ధతులూ సరికావంటున్నారు నిపుణులు. పప్పులో ఉండే కొన్ని రకాల పోషకాలు పప్పు ఉడికించిన నీటిలో చేరతాయి. ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లు, కొన్ని రకాల అమైనో ఆమ్లాలు ఉడికించిన నీటిలో కలుస్తాయట. ఈ నీటిని పడేయడం వల్ల ఆ పోషకాలు శరీరానికి అందకుండా పోతాయంటున్నారు నిపుణులు. కాబట్టి పప్పుతో పాటే ఈ నీటిని తీసుకోవడం లేదంటే దీంతో సూప్, బ్రాత్ వంటివి తయారుచేసుకోవడం.. మంచిదంటున్నారు. ఫలితంగా పప్పులోని పోషకాలు శరీరానికి అందుతాయని చెబుతున్నారు.
⚛ కొంతమందికి వండిన ఆహార పదార్థాల్ని పదే పదే వేడి చేయడం అలవాటు. పప్పుతో తయారుచేసిన వంటకాల్నీ ఇలాగే వేడి చేస్తుంటారు. అయితే దీని వల్ల పప్పులోని అమైనో ఆమ్లాలు క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుందంటున్నారు. అంతేకాదు.. ఆ కూరలు రుచి, తాజాదనాన్నీ కోల్పోతాయట. అందుకే పప్పులే కాదు.. ఏ వంటకాన్నీ పదే పదే వేడి చేయద్దని చెబుతున్నారు నిపుణులు.
⚛ ఎక్కువ నూనె వేసి, బాగా వేడెక్కాక పోపు గింజల్ని ఎర్రగా వేపి పప్పు కూరల్లో తాలింపు పెట్టడం చాలామంది చేసేదే. అయితే దీనివల్ల కూర మాడిపోయిన వాసన రావడంతో పాటు రుచినీ కోల్పోతుందని, అందులోని కొన్ని రకాల పోషకాలూ తరిగిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి నూనె మధ్యస్థంగా వేడెక్కాక.. తాలింపు గింజలు వేసి.. చిటపటలాడాక కూరల్లో కలిపి స్టౌ కట్టేస్తే సరిపోతుందంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.