
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీవీకే అధినేత విజయ్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని (Viay-led TVK government) అస్థిరపరిచేందుకు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు తమిళనాడు...
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీవీకే అధినేత విజయ్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని (Viay-led TVK government) అస్థిరపరిచేందుకు పన్నిన కుట్రను భగ్నం చేసినట్లు తమిళనాడు నిఘా విభాగం వెల్లడించింది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 15మంది టీవీకే ఎమ్మెల్యేలతో ఒకేసారి రాజీనామా చేయించేలా డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ పథకం రచించారని పేర్కొంది. ఈ వ్యవహారంలో సెంథిల్ బాలాజీ (Senthil Balaji) సోదరుడు వి. అశోక్ కుమార్ సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముగ్గురు వ్యక్తులు కుట్ర పన్నారని టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఇలయరాజా (Ilaiyaraja) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టీవీకే నేత తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ అయిన జేసీడీ ప్రభాకర్‌పై అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్ (IPDS) కన్సల్టెన్సీకి చెందిన తిరునావుక్కరసు అనే వ్యక్తి తనను కోరారని ఎమ్మెల్యే ఫిర్యాదులో వెల్లడించారు. ఇందుకుగానూ రూ.35 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించానని.. ఇకపై తనను సంప్రదించవద్దని అతడికి చెప్పినట్లు తెలిపారు.
అయితే, తమ మధ్య జరిగిన సంభాషణను బయటపెడతానని తిరునావుక్కరసు బెదిరించాడని.. దీంతో పోలీసులను ఆశ్రయించానని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) పార్టీ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిఘా అధికారుల సహకారంతో దర్యాప్తు చేపట్టారు. డీఎంకే నేత సెంథిల్ బాలాజీ సూచన మేరకే తిరునావుక్కరసు.. ఎమ్మెల్యే ఇళయరాజాను సంప్రదించారని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఆధునిక కాలంలో మహిళలు సైతం రైడర్లుగా రాణిస్తున్నారు.