ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్రానికి కొత్తగా రైల్వే లైన్ ప్రాజెక్టుల్ని తీసుకొస్తోంది. ఇటీవల కాలంలో కేంద్రం రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టుల్ని మంజూరు చేసింది.
ఈ రైల్వే లైన్లతో జిల్లాల మధ్య అనుసంధానంతో పాటుగా సరుకు, ఖనిజాల రవాణాకు ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లాల మధ్య కొత్తగా రెండు రైల్వే లైన్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. గుంతకల్లు నుంచి రేణిగుంట వరకు 298 కిలోమీటర్ల పొడవున ఈ రైల్వే లైన్లను ప్లాన్ చేశారు. ప్రస్తుతం గుంతకల్లు-రేణిగుంట సెక్షన్లో డబుల్ లైన్లు ఉన్నాయి.. ఈ రూట్లో కొత్తగా రెండు రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చాయి.ఆరు నెలల క్రితం అధికారులు ఈ ప్రాజెక్టుపై సర్వేచేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ రెండు కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 4,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ సెక్షన్లో మొత్తం 36 స్టేషన్లు ఉన్నాయి.. ప్రస్తుతం రైళ్లు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుగా రైల్వే లైన్లు ఉన్నాయి. సరుకు రవాణా, ఖనిజాల రవాణాకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. ఈ రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా కొత్తగా రెండు రైల్వే లైన్లను ప్లాన్ చేశారు. ఈ రెండు లైన్లను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తే కృష్ణపట్నం పోర్ట్కు గూడ్స్ రైళ్ల ద్వారా సరకులను సులభంగా చేరవేయొచ్చంటున్నారు.కొత్త రైల్వే లైన్లు పూర్తి చేస్తే వ్యవసాయ ఉత్పత్తుల్ని రవాణా చేసేందుకు లైన్ క్లియర్ అవుతుంది. అంతేకాదు అనంతపురం జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి.. అక్కడ తయారైన వాటిని రవాణా చేసేందుకు ఈ రైలు మార్గం కీలకంగా మారుతుంది. ఈ రెండు కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అందజేశామని అధికారులు తెలిపారు.. కేబినెట్ ఆమోదం రాగానే భూసేకరణ పనులు చేపడతామంటున్నారు. గుంతకల్లు నుంచి రేణిగుంట వరకు రెండు కొత్త లైన్లు ప్లాన్ చేయడంతో.. తిరుపతికి వెళ్లే ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు కూడా ఉపయోగంగా ఉంటుంది.ఇటు అనంతపురం రైల్వే స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో హైటెక్ హంగులతో కనిపిస్తోంది. కేంద్రం నుంచి అమృత్ నిధులు రూ. 9 కోట్లు విడుదల చేయగా.. మొదటి విడతలో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం రైల్వే స్టేషన్లో విశ్రాంతి గదులు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, అందుబాటులోకి వచ్చాయి. శ్రీనివాస్ నగర్వైపు కొత్తగా ముఖ ద్వారం నిర్మించగా.. 12 మీటర్ల వెడల్పుతో వంతెనను కూడా నిర్మిస్తున్నారు. రెండో విడతగా మరో రూ. 25 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం అనంతపురం రైల్వే స్టేషన్ మీదుగా దాదాపు 42 ఎక్స్ప్రెస్, 8 ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.. వీటికి తోడు వీకెండ్ రైళ్లు కూడా నడుస్తున్నాయి. అందుకే అనంతపురం రైల్వే స్టేషన్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై ఫోకస్ పెట్టారు.