
మెస్సి.. రొనాల్డో.. ఎంబాపె.. నెయ్మర్ వంటి అగ్రశ్రేణి ప్లేయర్లతో ఆయా దేశాల జట్లకు అత్యంత పేరు దక్కింది. కానీ, జర్మనీ పరిస్థితి భిన్నం. సమష్టి కృషితో ఫుట్‌బాల్ ప్రపంచంలో ఉన్నత శిఖరాలకు చేరుకుందీ టీమ్.
నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి ప్రపంచ కప్‌లోనూ టైటిల్ ఫేవరెట్లలో ఒకటి. అలాంటి జట్టు తీరా రౌండ్ 32లోనే ఓడి ఇంటిముఖం పట్టింది. అయితే, ఇది ఆ జట్టు చేసుకున్న స్వయంకృతాపరాధం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అదిరిపోయే విజయంతో ప్రపంచ కప్ 2026లో జర్మనీ తన జర్నీని ప్రారంభించింది. మొదటి మ్యాచ్‌లోనే పసికూన కురసావ్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. 7-1 తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత జర్మనీ 2-1తేడాతో ఐవరీకోస్ట్పై కాస్త కష్టంగానే గెలిచింది. కానీ, తన చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం ఓటమి తప్పలేదు. ఈక్వెడార్ చేతిలో 2-1తో జర్మనీ పరాజయం చవిచూసింది. లీగ్ స్టేజ్‌లో చేసిన పొరపాట్ల నుంచి ఈ జట్టు ఏమాత్రం పాఠాలు నేర్వలేదు. అందుకు మరో ఉదాహరణ నాకౌట్లో పరాగ్వేతో జరిగిన మ్యాచే. ఇందులో ఛాంపియన్ జట్టుగా జర్మనీ ఆడలేకపోయింది.
రౌండ్ 32లో పరాగ్వే చేతిలో జర్మనీ తన చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. మొత్తం 90 నిమిషాలతోపాటు అదనపు సమయంలో ఈ మ్యాచ్ 1-1తో డ్రా అయింది. దీంతో నాకౌట్లో ఫలితం తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌కు మ్యాచ్ వెళ్లింది. అక్కడా పరాగ్వే ప్లేయర్లతో జర్మనీకి తీవ్ర పోటీ తప్పలేదు. తొలి ఐదు ప్రయత్నాల్లో ఇరు జట్లూ మూడేసి గోల్స్ కొట్టి సమంగా నిలిచాయి. ఆ తర్వాత ‘సడెన్ డెత్’లో తొలుత జర్మనీకి అవకాశం వచ్చింది. కానీ స్టార్ ప్లేయర్లు లియోన్ గోరెట్జ్కా, వాల్డెమర్ ఆంటోన్, నాథనీల్ బ్రౌన్, మేలిక్ థై.. కిక్ కొట్టేందుకు ఆసక్తి చూపించలేదు. కెప్టెన్ కిమిచ్ అడిగినా సరే విముఖత ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. జట్టు తరఫున 72 మ్యాచులు ఆడిన గోరెట్జ్కాను రెండుసార్లు అడిగినా సరే.. కిక్ కొట్టేందుకు ముందుకు రాలేదు. చివరకు జొనాథన్ థా సడెన్ డెత్‌లో పెనాల్టీ కిక్ కొట్టాడు. జొనాథన్ కెరీర్లోనే ఇది తొలి పెనాల్టీ కిక్ కావడం గమనార్హం. అది సఫలం కాలేదు. మరోవైపు పరాగ్వే తరఫున కానలే గోల్ చేసి తన జట్టును రౌండ్ 16కి చేర్చాడు.
మ్యాచ్ సమయంలో హెడర్‌ను గోల్‌గా ఇవ్వకపోవడంతో జర్మనీ ఆటగాళ్లు రిఫరీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు అభిమానులు కూడా రిఫరీ వల్లే మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లిందని విమర్శించారు. కానీ, మ్యాచ్‌ను గెలిపించేందుకు అవకాశం ఉన్న పెనాల్టీ షూటౌట్లో కిక్ కొట్టేందుకు స్టార్లు ముందుకు రాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిఫరీపై ఆటగాళ్లు అసంతృప్తితో ఉండటమో.. లేదా ఒత్తిడి సమయంలో గోల్ కొట్టేంత ఆత్మవిశ్వాసం లోపించడమో దీనికి కారణమై ఉండొచ్చని పలువురి వాదన. అయితే, గెలిచే అవకాశం ఉన్నప్పుడు పెనాల్టీ కిక్‌ను వదులుకోవడం సరైన చర్య కాదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఒకప్పుడు జర్మనీ అంటే అర్జెంటీనా, ఫ్రాన్స్, పోర్చుగల్ వంటి టాప్ టీమ్‌లూ భయపడేవి. ఇప్పుడు చేతిలో ఉన్న మ్యాచ్‌ను వదులుకొని మరీ విమర్శల పాలైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.