
దశరథ నాగేంద్ర ప్రసాద్, లక్ష్మి దంపతుల కుమార్తె లావణ్య. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట ఆమె స్వస్థలం. చిన్నప్పటి నుంచీ చదువుల్లో ప్రతిభావంతురాలు.
డాక్టర్ కావాలన్నది ఆమె కల. దాంతో శ్రమించి నారాయణ మెడికల్ కళాశాలలో సీటు సాధించారు.
‘వైద్యో నారాయణో హరిః’ అంటారు. ప్రాణాలను కాపాడే వైద్యుడు దైవంతో సమానమని దీని అర్థం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల్ని కాపాడడమే కాదు, తనకు సోకిన ప్రాణాంతక వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు డాక్టర్ కుంకాల లావణ్య. తనలాంటి కష్టం ఇంకెవరికీ రాకూడదని దానిపై అవగాహన కల్పిస్తున్నారు.
దశరథ నాగేంద్ర ప్రసాద్, లక్ష్మి దంపతుల కుమార్తె లావణ్య. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట ఆమె స్వస్థలం. చిన్నప్పటి నుంచీ చదువుల్లో ప్రతిభావంతురాలు. డాక్టర్ కావాలన్నది ఆమె కల. దాంతో శ్రమించి నారాయణ మెడికల్ కళాశాలలో సీటు సాధించారు. 2010-16 మధ్య ఎంబీబీఎస్, ఆపై బెంగళూరులోని సెయింట్ మార్తాస్ హాస్పిటల్లో డీఎన్బీ (జనరల్ మెడిసిన్)చేశారు. అనంతరం చెన్నైలో డీఎం(న్యూరాలజీ) పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. తర్వాత నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరారు. ఆపై కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్‌తో లావణ్యకు వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. స్థానికంగానే వైద్యురాలిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. అప్పటికి ఆమె జీవితం హాయిగా, కెరియర్ ఉన్నతంగా సాగిపోతున్నాయి. కాలం ఎప్పుడూ మనం ఊహించినట్లు ఉండదుగా! అప్పుడప్పుడూ కఠిన పరీక్షలూ పెడుతుంది. లావణ్యకూ ఈ పరిస్థితి ఎదురైంది.
అది 2025 జనవరి నెల. ఒక రోజు... అప్పటివరకు హుషారుగా ఉన్న లావణ్యకు అకస్మాత్తుగా మాట పడిపోయింది. ఆపై కాసేపటికే నిలబడలేని పరిస్థితి. మొదట చిన్న సమస్యే అని సర్దిచెప్పుకొన్నా... మనసులో ఏదో అలజడి. రకరకాల పరీక్షలు చేయించుకున్నారామె. అప్పుడు బయటపడిన పేరే మయస్థీనియా గ్రావిస్. ఇది అరుదైన, దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్ వ్యాధి. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థే, కణజాలంపై దాడి చేయడం వల్ల నరాలు, కండరాల మధ్య సమాచార వ్యవస్థ దెబ్బతింటుంది. 32 ఏళ్లకే ఈ వ్యాధి రావడం లావణ్య కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. గొంతు, మెడ, కంటి కండరాలు బలహీనపడి మంచానికే పరిమితమయ్యారు. ఒకానొక దశలో మరణం తప్పదనీ భావించారు. దానికంటే ఎక్కువగా... స్వతహాగా న్యూరోడాక్టర్ అయినప్పటికీ తనను తాను కాపాడుకోలేకపోయాననే బాధే లావణ్యను ఎక్కువగా కుంగదీసింది. తర్వాత నెమ్మదిగా కుదుటపడి ఆలోచించారు. తనకు తానే ధైర్యం చెప్పుకొని చికిత్స మార్గాలు వెతకడం ఆరంభించారు. దేశవ్యాప్తంగా మయస్థీనియా గ్రావిస్ వ్యాధి బాధితులు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూపులో చేరి వారికి సలహాలు ఇస్తూనే... థైౖమస్ గ్రంథిని రోబోటిక్ సర్జరీ ద్వారా తొలగించే సర్జరీ చేయించుకున్నారు. అది విజయవంతం అయ్యింది. వైద్యులు దీర్ఘకాలిక విశ్రాంతి అవసరమన్నారు. కానీ, త్వరగా కోలుకుని ప్రాక్టీస్ ప్రారంభించాలనే మొండి పట్టుదలతో నాలుగు నెలల్లోనే కోలుకోగలిగారు. ఓ పక్క వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తూనే... మరోపక్క తాను అనుభవించిన బాధ మరెవరూ పడకూడదని ఈ వ్యాధిపై అవగాహన తీసుకురావడం ఆరంభించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా లక్షల ఖర్చుతో వాహనం తయారు చేయించారు. ప్రతి శుక్రవారం నేరుగా పేదల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే గొలగమూడి, పూడిపర్తి, సర్వేపల్లి తదితర గ్రామాల్లో ఉచితంగా వెద్య శిబిరాలు నిర్వహించారు. త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు.
ఒంగోలు శ్రీనివాస రాజారావు, ఈటీవీ నెల్లూరు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.