
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, కెనడాతో కలిసి ఫిఫా ప్రపంచ కప్ 2026 (FIFA World Cup 2026)కు ఆతిథ్యం ఇస్తోన్న మెక్సికో అద్భుతం చేసింది. మెగా టోర్నీలో ఈ దేశ జట్టు రౌండ్ 16కు దూసుకెళ్లింది.
రౌండ్ 32లో మెక్సికో 2-0 తేడాతో ఈక్వెడార్‌పై విజయం సాధించింది. ఇందులో పెద్ద వింతేముందంటారా? ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలో మెక్సికో 40 ఏళ్ల తర్వాత తొలిసారి నాకౌట్ మ్యాచ్‌లో నెగ్గడం విశేషం. చివరిసారిగా 1986లో మాత్రమే విజయం సాధించింది. నాలుగు దశాబ్దాల తర్వాత గెలవడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇంగ్లాండ్ vs డీఆర్ కాంగో మ్యాచ్‌లో విజేతతో ప్రికార్టర్స్లో మెక్సికో తలపడనుంది.
సొంత అభిమానుల మధ్య వరల్డ్ కప్ ఆడుతున్నామనే ధీమా మెక్సికో ప్లేయర్లలో కనిపించింది. గ్రూప్ స్టేజ్‌లోనూ అగ్రస్థానంతో నాకౌట్‌కు చేరిన ఈ జట్టు.. ఇక్కడా అదే దూకుడును కొనసాగించింది. వర్షం కారణంగా దాదాపు గంటన్నర ఆలస్యంగా ఆట మొదలైంది. అయితే, 22వ నిమిషంలోనే మెక్సికో ఆటగాడు జులియన్ ఖ్వినోనెస్ గోల్ కొట్టాడు. ఆ తర్వాత 31వ నిమిషంలో రౌల్ జిమెనెజ్ గోల్‌తో ఈ జట్టు ఈక్వెడార్‌పై 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం ఇరు జట్లూ గోల్స్ కోసం ప్రయత్నించాయి. ఇందులో మెక్సికోనే ఎక్కువ షాట్లను గురిపెట్టింది. ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా ఈక్వెడార్ ఆటగాడు పియారో హిన్కాపీ రెడ్ కార్డ్‌ను ఎదుర్కొన్నాడు. చివరకు మెక్సికో విజయంతో ఈక్వెడార్ ఇంటిముఖం పట్టింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.