
బంగారం మార్కెట్లో ఈరోజు అనూహ్య మార్పు కనిపించింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులతో ఉన్న గోల్డ్ రేట్లు...ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే ఒక్కసారిగా దిగివచ్చాయి.
దీంతో బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారిలో కొత్త ఆశలు మొదలయ్యాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే... 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.1,260 తగ్గి...రూ.1,40,780కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.1,150 పతనమై రూ.1,29,050 వద్ద స్థిరపడింది.పెళ్లిళ్లు, శుభకార్యాలు లేదా బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న కుటుంబాలకు ఇది కొంత ఉపశమనంగా చెప్పొచ్చు.
అయితే బంగారం తగ్గినా... వెండి మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. బంగారం మార్కెట్లో భారీ మార్పులు కనిపిస్తున్నప్పటికీ వెండి మాత్రం స్థిరంగా ఉండటం ఆసక్తికరంగా మారింది.
మార్కెట్ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం... అంతర్జాతీయంగా అమెరికా డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు... ఇవన్నీ కలిసి బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అంతేకాదు... అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మార్కెట్ అంచనాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సింగపూర్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. దుబాయ్ మార్కెట్లో కూడా రేట్లు దిగివచ్చాయి. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం... ధరలు తగ్గుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలను బట్టి మళ్లీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకేసారి మొత్తం కొనుగోలు చేయకుండా... రోజువారీ ధరలను గమనిస్తూ దశలవారీగా కొనుగోలు చేస్తే రిస్క్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది.