
IMD Rain Alert : మే ఎండింగ్ లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఎంటర్ అవుతాయి... అప్పట్నుండి జోరువానలు కురుస్తాయని వాతావరణ నిపుణులు భావించారు. కానీ వారి అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి...
జూన్ వచ్చేవరకు రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వలేదు. ఈ జూన్ నెలంతా రుతుపవనాల విస్తరణకే సరిపోయింది... అందుకే వర్షాల జాడ లేదు.
అయితే జూలైలో పరిస్థితి పూర్తిగా మారిపోనుందట... వర్షాలు కాదు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు జోరందుకున్నాయి... ఈ నెలలో కుండపోత తప్పదంటున్నాయి తెలంగాణ, ఏపీ వాతావరణ శాఖలు.
ఇప్పటికే నైరుతి రుతుపవనాలు యాక్టివ్ గా మారాయి. అలాగే ఉపరితల ఆవర్తనం, ద్రోణి కొనసాగుతోంది. దీంతో రెండుమూడు రోజులుగా ఆంధ్ర, ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత పెరిగింది. అయితే మరో రెండ్రోజుల్లో వాతావరణ పరిస్థితులు వర్షాలకు మరింత అనుకూలంగా మారతాయని వాతావరణ శాఖ చెబుతోంది. జూలై 3 (శుక్రవారం) నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది.
అయితే బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం మరింత బలపడితే వర్షాలు కూడా మరింత జోరందుకుంటాయి. ఇది క్రమక్రమంగా బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారితే మాత్రం కుండపోత వర్షాలుంటాయి. అంటే ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలు కాస్త అతిబారీ వర్షాలుగా మారతాయన్నమాట... అప్పుడు వరదలు కూడా సంభవించే ఛాన్సెస్ ఉంటాయి.
ఇదిలావుంటే ఇవాళ (జూలై 1, బుధవారం) ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో వర్షాలుంటాయని హెచ్చరించింది. అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలే కురుస్తాయి... కొన్నిచోట్ల మాత్రం భారీ వర్షాలుండే అవకాశాలున్నాయంటోంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడొచ్చని APSDMA ప్రకటించింది.
ఇప్పటికే ఉత్తర, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇవి ఇవాళ (జూలై 1, బుధవారం) కూడా కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ వర్షాలకు ఈదురుగాలులు తోడవుతాయని... గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తెలంగాణ వెదర్ మ్యాన్ కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించినట్లుగానే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని అంటున్నారు. అయితే రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తాయని వెదర్ మ్యాన్ తెలిపారు.
హైదరాబాద్ విషయానికి వస్తే.. ఆకాశం పాక్షికంగా మేఘాలతో నిండివుంటుందని వెదర్ మ్యాన్ ప్రకటించారు. సాయంత్రం లేదా రాత్రి వేళలో నగరంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయట. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు.