మంత్రి పదవి రాకపోవడంపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాటు ఏళ్ల పాటూ ఎంత బాగా పనిచేశారో..
బొండా ఉమా ఎలా పనిచేశారో అందరికి తెలుసన్నారు. తనపై పల్నాడు జిల్లా మాచర్లలో దాడి చేశారని.. కృష్ణా జిల్లా గుడివాడలో దాడి చేశారని.. అయినా సరే తాను ఎక్కడా తగ్గకుండా పనిచేశానన్నారు. కానీ వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన పార్థసారథికి మంత్రి పదవి వచ్చిందని అసంతృప్తిని వ్యక్తం చేశారు బొండా ఉమామహేశ్వరరావు. విజయవాడలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై నిర్వహించిన విజయోత్సవ సభలో బొండా ఉమామహేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, సవితలు ఎక్కడి నుంచి వచ్చారని.. ఇలా టీడీపీలోకి వచ్చిన 15మంది పేర్లు చెప్పొచ్చన్నారు. కానీ పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన తనకు మంత్రి పదవి రాలేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. మంత్రి పదవి రాకపోవడంపై బొండా ఉమామహేశ్వరరావు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో బొండా ఉమామహేశ్వరరావు వీడియో వైరల్ అవుతోంది. బొండా ఉమామహేశ్వరరావు 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. 2017లో రెండో విడతలో పదవి వస్తుందని ఆశించారు.. కానీ ఆయనకు అవకాశం దక్కలేదు. ఆ సమయంలో కూడా బొండా ఉమా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.. అధిష్టానం బుజ్జగించడంతో వెనక్కు తగ్గారు. వాస్తవానికి ఆయనకు మంత్రి పదవి రావడం ఖాయమని అప్పట్లో ప్రచారం జరిగింది.. కొన్ని సామాజిక సమీకరణాలు మారడంతో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. 2024 ఎన్నికల తర్వాత బొండా ఉమా మంత్రి పదవి గురించి ఎక్కడా ఏం మాట్లాడలేదు.. రెండేళ్ల తర్వాత ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు అవకాశం ఉండటంతో బొండా ఉమా ముందే ఈ వ్యాఖ్యలు చేశారా.. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలనే సంకేతాలను ప్రభుత్వానికి పంపించారా అనే అనే చర్చ జరుగుతోంది. మరి ఉమా వ్యా్ఖ్యలపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి. బొండా ఉమామహేశ్వరరావు 2014 ఎన్నికల్లో తొలిసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో మరోసారి పోటీచేసి ఓడిపోయారు.. 2024 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన తనకు మంత్రి పదవి వస్తుందని పదవిపై ఆశలు పెట్టుకున్నారు.