
IND vs ENG : న్యూజిలాండ్ చేతిలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్ జట్టుకు ఇప్పుడు మరో అంతకంటే పెద్ద సవాల్ ఎదురుకాబోతోంది. అదే బలమైన టీమిండియాతో జరగబోయే పరిమిత ఓవర్ల సమరం.
టెస్ట్ క్రికెట్ హడావుడి ముగిసిన తర్వాత ఇప్పుడు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ మొత్తంలో అందరి దృష్టి, క్రికెట్ విశ్లేషకుల ఫోకస్ అంతా కేవలం ఒకే ఒక్కడిపైనే ఉంది. అతడే.. టీమిండియాలోకి దూసుకొచ్చిన 15 ఏళ్ల యువ సంచలనం, సూపర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ. అతడి ఆటను చూడటానికి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
బుధవారం (జూలై 1, 2026) భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ కీలక మ్యాచ్‌లోనే వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలంటూ అభిమానుల నుంచి విపరీతమైన డిమాండ్ వినిపిస్తోంది. అయితే భారత జట్టు యాజమాన్యం మాత్రం తమ వ్యూహాలను బయటపెట్టలేదు. వైభవ్ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తాడా లేదా అనే విషయంపై టీమిండియా ఎటువంటి క్లూ ఇవ్వలేదు. అయినప్పటికీ, ఇంగ్లాండ్ జట్టు మాత్రం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. మైదానంలోకి దిగకముందే ఆ కుర్రాడిని అడ్డుకోవడానికి ఇంగ్లీష్ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది.
మ్యాచ్ ప్రారంభానికి ఒక రోజు ముందు, అంటే మంగళవారం (జూన్ 30) జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ప్రశ్నకు బ్రూక్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “వైభవ్ సూర్యవంశీ చాలా అద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాడిగా కనిపిస్తున్నాడు. అతడిని మేము తక్కువ అంచనా వేయడం లేదు. అయితే ఆ 15 ఏళ్ల బ్యాటర్‌ను త్వరగా అవుట్ చేయడానికి మా జట్టు ఇప్పటికే ఒక ప్రత్యేకమైన వ్యూహాన్న సిద్ధం చేసుకుంది” అని ఇంగ్లీష్ కెప్టెన్ కీలక ప్రకటన చేశాడు.
ఇంగ్లాండ్ కెప్టెన్ చెప్పిన ఆ సీక్రెట్ ప్లాన్ ఏంటనేది కేవలం బ్రూక్, వారి జట్టుకు మాత్రమే తెలుసు. అయితే ఈ ప్లాన్లన్నీ మైదానంలో అమలు కావాలంటే ముందుగా వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో టాస్ సమయానికి తుది జట్టులో చోటు సంపాదించాల్సి ఉంటుంది. ఒకవేళ అతను చేస్టర్-లే-స్ట్రీట్ మైదానంలో అడుగుపెడితే గనుక ఇంగ్లాండ్ బౌలర్లకు తిప్పలు తప్పవని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎందుకంటే గత ఐపీఎల్ సీజన్లో వైభవ్ తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రపంచ స్థాయి దిగ్గజ బౌలర్ల వ్యూహాలను సైతం బ్రేక్ చేశాడు. మరి ఇరు జట్ల మధ్య జరగనున్న ఈ సమరంలో హ్యారీ బ్రూక్ వేసిన ప్లాన్ పనిచేస్తుందో లేదో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..