
ఫ్రాన్స్ దేశంలో ఇటీవల జరిగిన జి7 సమావేశాలకు మన దేశం నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా నుంచి ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ వెళ్లారు. ఇద్దరు కలుసుకొని అనేక విషయాలు చర్చించుకున్నారు.
అయితే చర్చించిన వివరాలకంటే ఎక్కువగా ప్రపంచాన్ని ఆకర్షించిన విషయం వారిద్దరూ చూపించిన స్నేహ వాతావరణం. పీఎం మోడీ కంటే ఎక్కువగా ప్రెసిడెంట్ ట్రంప్ నవ్వుతూ పీఎం మోడీని పొగుడుతూ కనిపించారు. ‘మోడీ తనకు చాలా మంచి స్నేహితుడు అని.. అయితే చాలా గట్టివాడు అని కూడా చెబుతూ, ‘ఈయనను చూడండి. చాలా అందంగా కనిపిస్తారు. దేవదూతలా సున్నితంగా కనిపిస్తారు. కానీ ఆయన చాలా దృఢమైన, కఠినమైన వ్యక్తి. గొప్ప వాణిజ్య చర్చాకర్త. ఆయన భారత ప్రజలను ప్రేమిస్తారు. అలాగే అమెరికానూ ప్రేమిస్తారు అంటూ ద్వైపాక్షిక చర్చలలో తన పాయింట్ ఒప్పుకునేలా వాదిస్తాడు (tough negotiator) అని సున్నితంగా చురకలు కూడా వేశారు. మరోవైపు భారత్పైగానీ, ప్రధాని మోదీపైగానీ దాడి జరిగితే సహాయం చేయడానికి అమెరికా ముందుకు వస్తుందని ట్రంప్ పేర్కొనడం విశేషం. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం భారత్‌కు శ్వేతసౌధంలో ఒక గొప్ప మిత్రుడు ఉన్నట్టేనని చెప్పడం వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం. భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతమం అవుతాయని హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యం మరింత వేగంగా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో భారతీయ పెట్టుబడులు పెరుగుతున్నాయన్న ఆయన.. దీనిని తాము స్వాగతిస్తున్నామన్నారు.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్ఠంభన, సుంకాల విధింపు, ఇటీవల హోర్ముజ్‌లో అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించడం వంటి ఘటనలతో.. ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి వీరిద్దరి మంధ్య ఉన్న స్నేహం, మిత్రత్వం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల ఒప్పందంపై 10-15 నెలలుగా జరుగుతున్న చర్చలు సానుకూలంగా జరుగుతాయా? ఆ ఒప్పందం భారత దేశ ప్రయోజనాలను పెంచుతుందా? లేదా? అని విశ్లేషకులు ఎదురు చూస్తున్నారు.
భారత్-అమెరికా సంబంధాలు 21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా ఎదిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం ప్రపంచవ్యాప్తంగా అందిని ఆకర్షించింది ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలం (2017-2021)లో ట్రంప్–మోదీల మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేక గుర్తింపును పొందింది. 2019లో అమెరికాలో జరిగిన ‘హౌడీ మోదీ’ సభ, 2020లో అహ్మదాబాద్‌లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప” కార్యక్రమం ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. లక్షలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమాలు ఇద్దరు నాయకుల వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని మాత్రమే కాకుండా, భారత్–అమెరికా సంబంధాల బలాన్ని కూడా ప్రతిబింబించాయి. ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఈ వ్యక్తిగత స్నేహం కొనసాగుతోంది. ఇరువురు నాయకులు రక్షణ, వాణిజ్యం, సాంకేతిక రంగాలు, ఇండో–పసిఫిక్ ప్రాంత భద్రత వంటి అంశాలపై పరస్పర సహకారాన్ని మరింత విస్తరించాలని సంకల్పించారు.
భారత – అమెరికా సంబంధాలలో ఎలాంటి అంశాలు ఉన్నాయో చూద్దాం
రక్షణ రంగం: గత దశాబ్దంలో భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా ఎదిగింది. అనేక విషయాలలో భారత దేశం ఆమ్నెరికాకు మద్దతు గా ఉంటోంది. ముఖ్యంగా చైనా పెరుగుతున్న ప్రభావాన్ని సమతుల్యం చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అమెరికా భావిస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న ప్రభావం భారత్–అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్న ప్రధాన అంశంగా మారింది.
సాంకేతిక రంగం: ఈ రంగంలో కూడా ఇరు దేశాల సహకారం వేగంగా పెరుగుతోంది. కృత్రిమ మేధస్సు (ఎఐ), సెమీకండక్టర్లు, సైబర్ భద్రత, అంతరిక్ష పరిశోధనలు, క్వాంటం కంప్యూటింగ్, కీలక ఖనిజాల అభివృద్ధి వంటి రంగాల్లో సంయుక్త కార్యక్రమాలు కొనసాగుతు న్నాయి. భారత యువతలోని ప్రతిభ, వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అమెరికా సంస్థలను ఆకర్షిస్తున్నాయి.
ఆర్థిక రంగం: భారత్-అమెరికా వాణిజ్యం గణనీయంగా పెరిగినప్పటికీ, ఇదే రంగంలో ఎక్కువ విభేదాలు కూడా కనిపిస్తున్నాయి. ‘అమెరికా ఫస్ట’ విధానాన్ని అనుసరిస్తున్న అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ఉత్పత్తులకు మరింత మార్కెట్ లభించాలని, భారత్ విధిస్తున్న దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్‌ను మరింత తెరవాలని, అమెరికా నుంచి ఇంధనం, రక్షణ సామగ్రి కొనుగోళ్లు పెంచాలని ఆయన ప్రభుత్వం కోరుతోంది. భారత్ మాత్రం దేశీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చర్చలు కొనసాగిస్తోంది. అందువల్ల వాణిజ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, మొత్తం సంబంధా లపై వాటి ప్రభావం పరిమితంగానే ఉంది.
భారత్ అనుసరిస్తున్న “వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి” విధానం కూడా కొన్నిసార్లు అమెరికాతో అభిప్రాయ భేదాలకు కారణమవుతోంది. అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగి స్తూనే, రష్యా, యూరప్, మధ్యప్రాచ్య దేశాలతో కూడా భారత్ తన సంబంధాలను కొనసాగి స్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు, రక్షణ సామగ్రి దిగుమతుల విషయంలో అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ, భారత విదేశాంగ విధానం పూర్తిగా భారత జాతీయ ప్రయోజనాల ఆధారంగానే కొనసాగుతుందని న్యూఢిల్లీ స్పష్టం చేస్తోంది. ట్రంప్-మోదీల మధ్య వ్యక్తిగత స్నేహం ఎంత బలంగా ఉన్నప్పటికీ, కొన్ని అంశాల్లో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దిగుమతి సుంకాలు, వాణిజ్య ఒప్పందాలు, ఇంధన విధానం, రష్యాతో భారత్ సంబంధాలు వంటి అంశాల్లో ఇరువైపులా వేర్వేరు అభిప్రాయాలు కనిపిస్తుంటాయి.
భారతీయ సంతతికి చెందిన దాదాపు 60 లక్షల మంది అమెరికాలో నివసిస్తూ వ్యాపారం, వైద్యం, సాంకేతిక రంగం, విద్య, రాజకీయాల్లో విశేష విజయాలు సాధిస్తున్నారు. ఈ ప్రవాస భారతీయులే రెండు దేశాల మధ్య ప్రజల స్థాయిలో బలమైన వారధిగా నిలుస్తున్నారు. మొత్తానికి, ట్రంప్-మోదీల వ్యక్తిగత స్నేహం భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన ప్రేరణగా పనిచేసింది. అయితే నేటి భారత్-అమెరికా సంబంధాలు కేవలం ఇద్దరు నాయకుల స్నేహం పైనే ఆధారపడలేదు. ప్రజాస్వామ్య విలువలు, ఉమ్మడి వ్యూహాత్మక ప్రయోజనాలు, సాంకేతిక భాగస్వామ్యం, ఆర్థిక సహకారం, చైనా వంటి భౌగోళిక సవాళ్లను ఎదుర్కొనే ఉమ్మడి దృక్పథమే ఈ సంబంధాలకు అసలైన పునాది. వ్యక్తిగత స్నేహం మారవచ్చు, నాయకులు మారవచ్చు, కానీ భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మాత్రం రాబోయే దశాబ్దాల్లో మరింత బలపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.