
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సుప్రీం కోర్టులో అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump)నకు చుక్కెదురైంది. జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న ట్రంప్ ప్రతిపాదనలను అక్కడి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.
జన్మతః పౌరసత్వాన్ని అమెరికా సుప్రీం కోర్టు సమర్థించింది. కొన్ని పరిమితులు మినహా.. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ దేశ పౌరులేనని స్పష్టం చేసింది. విదేశాలకు చెందిన దంపతులకు అమెరికాలో పిల్లలు పుట్టినప్పటికీ వారికి ఆ దేశ పౌరసత్వం వర్తించబోదని వాదిస్తున్న ట్రంప్.. ఇందుకు సంబంధించి అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
‘‘పౌరసత్వం అనేది అప్పుడూ, ఇప్పుడూ.. మన రాజకీయ సమాజంలో స్వేచ్ఛగా పాల్గొనే అవకాశం కల్పించే హక్కు. ఈ దేశంలో జన్మించే ప్రతి వ్యక్తికి వీటిని అందిస్తామని 14వ సవరణ రూపకర్తలు హామీ ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని మేము ఈరోజు నిలబెట్టుకుంటున్నాం’’ అని సవరణపై చట్టసభలో చర్చను ప్రస్తావిస్తూ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ తీర్పు వెల్లడించారు. అమెరికాలో జన్మించే ప్రతి ఒక్కరికీ పౌరసత్వ హక్కును కొనసాగించాలని సుప్రీం ధర్మాసనంలోని మెజార్టీ సభ్యులు పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, గ్రీన్‌కార్డు హోల్డర్లు కానివారి పిల్లల పౌరసత్వాన్ని గుర్తించవద్దని ట్రంప్ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, దిగువ కోర్టులు వీటిని తిరస్కరించగా.. తాజాగా సుప్రీం కోర్టు కూడా దిగువ కోర్టుల నిర్ణయాన్ని సమర్థించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.